Sunday, May 5, 2024

సోనియాగాంధీతో వీహెచ్ భేటీ, తెలంగాణ పార్టీ నాయ‌క‌త్వంపై ఫిర్యాదు?

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు, ఫిర్యాదుల పంచాయితీ హస్తిన చేరింది. సోమవారం కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పార్లమెంట్ సభ్యులు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అవ్వడం ఆసక్తి రేపింది. ఇటీవల ఢిల్లీ వచ్చిన ఆయన సోనియాగాంధీని కలవడానికి ప్రయత్నించారు. అయితే ఆమె అపాయింట్‌మెంట్ ఇచ్చే సమయానికి వీహెచ్ హైదరాబాద్ వెళ్లిపోయారు. తాజాగా ఆయన సోమవారం సోనియా గాంధీతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ప్రజల పక్షాన చేపట్టాల్సిన కార్యక్రమాలు గురించి సోనియాతో చర్చించానని తెలిపారు.

ధాన్యం కొనుగోళ్లు, పెట్రో ఉత్పత్తుల ధరలు, నిత్యావసర వస్తువుల ధరల పెంపుపై పోరాడమని సోనియా గాంధీ దిశానిర్దేశం చేశారని వీహెచ్ చెప్పుకొచ్చారు. తాను కార్యకర్తగా పార్టీలో జీవితాన్ని ప్రారంభించానని, కాంగ్రెస్ బలోపేతానికి రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటిస్తానని చెప్పుకొచ్చారు. చచ్చేవరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని పునరుద్ఘాటించారు. తాను సోనియా గాంధీతో చర్చించిన అంశాలన్నీ బయటకు చెప్పలేనని ఆయన అన్నారు. సీనియర్లను గౌరవించడం, వారి అనుభవాన్ని ఉపయోగించుకోవటం నాయకత్వ బాధ్యతల్లో ఉన్న వారు చేయాలని అభిప్రాయపడ్డారు. అయితే వీహెచ్ సోనియా గాంధీకి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. సీనియర్లను పట్టించుకోవడంలేదని, వారి అనుభవాన్ని పార్టీకి ఉపయోగించుకోవట్లేదని ఆమె దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement