Saturday, April 13, 2024

TS – డ్రగ్స్ పై ఉక్కుపాదం… మహిళా సంరక్షణ ప్రత్యేక చర్యలు – సీపీ తరుణ్ జోషి

మల్కాజ్గిరి ప్రభ న్యూస్ – రాచకొండ కమిషనరేట్ నూతన కమిషనర్ గా నియమితులైన తరుణ్ జోషి ఈ రోజు సిపి ఆఫీస్ నేరేడుమెట్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాచకొండలో పని చేస్తున్న డీసీపీ, ఏసీపీ మరియు ఇతర అధికారులతో సమావేశమయ్యారు.

కమిషనర్ మాట్లాడుతూ.. రాచకొండ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా మరియు ప్రాణాపాయం కలిగించే తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్వరిత గతిన నేరనిరూపణకు కృషి చేస్తామని పేర్కొన్నారు

సివిల్, ఏఆర్, బెటాలియన్, ట్రాఫిక్ వంటి అన్ని విభాగాలను సమన్వయంతో పని చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళా సంరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని, షీ టీమ్స్ బృందాలను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.

డ్రగ్స్ సరఫరా , వినియోగం మీద ఉక్కుపాదం మోపుతామని, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని, ప్రజలలో సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

గతంలో రాచకొండ అదనపు కమిషనర్ గా పని చేసిన అనుభవంతో రాచకొండ పరిధిలోని అన్ని ప్రాంతాల మీద సంపూర్ణ అవగాహన ఉందని, మూడు కమిషనరేట్లతో సమన్వయంతో కలిసి పనిచేస్తామని, ప్రజలకు ఎల్లవేళలా సేవలందిస్తామని, ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తామని పేర్కొన్నారు. నేరాలను అరికట్టడంలో అందరితో కలిసికట్టుగా పనిచేస్తామని, పోలీస్ సిబ్బంది సంక్షేమంపై కూడా దృష్టి సారిస్తామని ప్రత్యేకంగా పేర్కొన్నారు

- Advertisement -

. ప్రజలు నేర భయం లేకుండా ఉండాలంటే అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి నేరాలను అదుపు చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డీసీపీ యాదాద్రి రాజేష్ చంద్ర ఐపీఎస్, డీసీపీ మల్కాజిగిరి పద్మజ ఐపీఎస్, డీసీపీ ఎల్ బి నగర్ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్, డీసీపీ ఎస్బి కరుణాకర్, డీసీపీ అడ్మిన్ ఇందిర, డీసీపీ ఎస్ఓటీ మురళీధర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement