Thursday, May 2, 2024

TS – రేవంత్ రాజీనామా చేయ్ – నేను సి ఎం గా కాళేశ్వరం నీళ్లు అందిస్తా – హరీష్ రావు

హైద‌రాబాద్ : తెలంగాణ రైతుల‌కు న‌ష్టం క‌ల‌గ‌కుండా ప్రాజెక్టు పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు చేప‌ట్టి సాగునీరు అందించాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరుతున్నాం. కానీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేదు. నీళ్లు ఎత్తిపోసేందుకు అవ‌కాశం ఉన్నా కూడా ఆ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం లేదు. వాళ్ల‌కు చేత‌కాక‌పోతే రేవంత్‌ను రాజీనామా చేయ‌మ‌ను. నేను ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌ స్వీకారం చేసి చూపిస్తాన‌ని హ‌రీశ్‌రావు చెప్పారు..

ఇప్ప‌టికీ నీళ్లు ఎత్తిపోసే అవ‌కాశం ఉంది. అదే విష‌యాన్ని ఇంజినీర్లు కూడా చెబుతున్నారు. వాళ్ల‌కు చేత‌కాక‌పోతే మాకు ప్ర‌భుత్వాన్ని అప్ప‌జెప్ప‌మ‌నండి. మేం చేసి చూపిస్తాం. రేవంత్ రెడ్డిని రాజీనామా చేయ‌మ‌ను. నేను ఎక్కి చేపిస్తా. రేవంత్‌ను దిగ‌మ‌ను. నేను ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసి చూపిస్తా. నాకు మ‌ద్ద‌తు ఇస్తా అంటే ఐయామ్ రెడీ టు టేక్ ఇట్. ఆయ‌న‌కు చేత‌కాదు.. హ‌రీశ్‌రావు నీవు చేయ్ అంటే చేసి చూపిస్తా. రైతుల‌కు న‌ష్టం క‌ల‌గ‌కుండా పున‌రుద్ధ‌ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్ట‌మ‌ని కోరుతున్నాం అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు

మొన్న మీరు మేడిగడ్డ వెళ్తుంటే ఎమ్మెల్యేలకు పచ్చని పొలాలను చూపించాల్సిందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరెంత తక్కువ చేసి మాట్లాడినా అది ముమ్మాటికి తెలంగాణకు వరదాయిని అన్నారు హరీశ్. తెలంగాణ ప్రజలకు జీవ ధార అని పేర్కొన్నారు.

లోయర్ మానేరు నుంచి సూర్యపేట దాకా, నిండిన చెరువులు, పండిన పంటలు, భూమిలో పెరిగిన ఊటలు, మోటారు లేకుండనే ఉబికివస్తున్న బోర్ల పంపులు ఇవన్నీ కాళేశ్వరం ఫలాలే అన్నారు మాజీ మంత్రి. కూడెల్లి వాగు పొంగిందన్నా, హల్దీ వాగు దుంకిందన్నా, అన్నపూర్ణ రిజర్వాయర్ నిండిందన్నా, రంగనాయక్ సాగర్ నిండిందన్నా, మల్లన్న సాగరం నిండిందన్నా, కొండ పోచమ్మ సాగర్ నిండిందన్నా అది కాళేశ్వరం ప్రసాదించిన ఫలితమే అని కొనియాడారు హరీశ్ రావు. ఇవాళేదో రెండు పిల్లర్లు కుంగినాయని, తెలంగాణకు ప్రాణాధారమైన జీవాధారను మీరు అవమానిస్తున్నరన్నని… అలక్షంచేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం మొత్తం ప్రాజెక్టునే డ్యామేజ్ చేయాలనే దుష్ట పన్నాగం పాల్పడుతున్నారన్నారు.

కుంగిన పిల్లర్లకు రిపేర్లు చేయించి పొలాలకు నీళ్లు మళ్లించాలన్నారు హరీశ్ రావు. దీనిపై విచారణలు జరిపించండి. బాధ్యులయిన వారిని నిరభ్యంతరంగా శిక్షించండి. కానీ ప్రజల ప్రయోజనాలకు గండి కొట్టకండి. తెలంగాణ రైతుల నోట్లో మన్ను కొట్టకండి అన్నారు. కాంగ్రెస్ హయాంలో పంజాగుట్టలో ఫై ఓవర్ కూలి చాలామంది చనిపోయారని గుర్తు చేశారు. పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని చెప్పారు. రాయలసీమలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిందన్నారు. ఇలాంటి ఘటనలు జరిగితే కారకులపై శిక్షించి, పునరుద్ధరణ చేసి రైతులకు అన్యాయం జరగకుండా చూస్తారన్నారు.

- Advertisement -

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొన్ననే కాళేశ్వరం స్టడీ టూర్ వచ్చి, నేర్చుకున్నారన్నారు. ప్రాజెక్టును చూసి ప్రశంసించారన్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ నాయకులు రాజకీయ లబ్ధి కొరకు రేపు డైవర్షన్ టూర్ పెట్టుకున్నారని విమర్శించారు హరీశ్ రావు. ఇంజినీర్లు నిన్న వాస్తవాలు చెబుతుంటే, వారిని దబాయించి మాట్లాడుతున్నారన్నారు. వాస్తవాలు బయటకు చెప్పాలని డిమాండ్ చేశారు . కాళేశ్వరం ప్రాజెక్టు కెనాల్స్ ద్వారా 546 చెరువులు నింపి 39వేల ఎకరాలకు నీల్లు అందించామన్నారు. కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీ నీళ్లకు కలుపడం ద్వారా 2,143 చెరువులు నింపాం. తద్వారా లక్షా 67వేల ఎకరాలు నీళ్లు వచ్చాయి. దింతో పాటు ఇవి కాకుండా 17లక్షల ఎకరాలను స్టెబిలైజ్ చేశాం. మొత్తంగా 20లక్షల 33,572 ఎకరాలకు నీళ్లు అందించామన్నారు.

హల్దీ వాగు, కూడవెళ్లి వాగులో 20వేల ఎకరాలకు నీళ్లు అందింది. ఇదేది ఇంజినీర్లు చెప్పకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు

నిజానికి ఏ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలోనైనా మొదట హెడ్ వర్క్స్ .. అంటే డ్యాంలు, బరాజ్ లు, స్పిల్ వే గేట్లు, జలాశయాలు, ఎత్తిపోతల పథకాలు అయితే పంప్ హౌస్ లు , సర్జిపూల్స్, విద్యుత్ సబ్ స్టేషన్ లు, విద్యుత్ లైన్లు, డెలివరీ సిస్టర్న్ లు తదితర అనుబంద నిర్మాణాలు పూర్తి చేస్తారు. వీటి పైననే ప్రభుత్వాలు నిధులు కేటాయించి ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. ఎందుకంటే ఇవి నిర్మాణం కాకుండా ఆయకట్టుకు నీరివ్వలేమన్నారు. వీటి తర్వాతనే ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణంపై ఖర్చు చేయడం జరుగుతుందన్నారు.

రీ ఇంజనీరింగ్ వలన ప్రాజెక్టు అంచనా వ్యయం అనివార్యంగా పెరుగుతుందన్నారు. ప్రాణహిత చేవెళ్ళ ఆంచనా విలువల 17 వేల కోట్లతో మొదలై 38 వేల కోట్లకు పెరిగి కేంద్ర జల సంఘానికి నివేదించే నాటికి 40 వేల కోట్లకు పెరిగింది. కాలేశ్వరం విషయంలో జలాశయాల సామర్థ్యం పెంచామన్నారు. కొత్త జలాశయాలు ప్రతిపాదించామన్నారు. జలాశయాల సామర్థ్యాన్ని పెంచినందున భూసేకరణ, పునరావాసం కోసం అదనంగా ఖర్చు పెరుగుతుందని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎందుకు నీళ్లు రాలేదు ఇప్పుడు ఎందుకు వచ్చాయి? ఈ విషయం రైతులను అడగాలన్నారు. ఏది నిజం ఏది అబద్ధం ప్రజలకు తెలుసు.

కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమాలలో మీ పాలనలో ఎందుకు నీళ్లు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో పెండింగ్ ప్రాజెక్టులు అయితే, మా హయాంలో రన్నింగ్ ప్రాజెక్టులు చేశామన్నారు. 90శాతం పనులు పూర్తి చేశామన్నారు. దయచేసి పునరుద్దరణ చర్యలు చేపట్టాలని కోరారు. విచారణకు మేము సిద్ధం మేము ఎలాంటి తప్పు చేయలేదన్నారు హరీశ్ రావు. రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. టెక్నికల్ సమస్య తెలుసుకొని యుద్ధప్రతిపాదికన పనులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు హరీశ్ రావు.

Advertisement

తాజా వార్తలు

Advertisement