Sunday, April 28, 2024

Ts | వచ్చేనెల 3 నుంచి అసెంబ్లి.. సర్క్యులర్‌ జారీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. వచ్చేనెల (ఆగస్టు) 3 నుంచి శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లి కార్యదర్శి నర్సింహాచార్యులు సర్క్యులర్‌ జారీ చేశారు. అసెంబ్లి సమావేశాల నేపథ్యంలో శని, ఆది (ఈ నెల 29, 30 తేదీల్లో) వారాల్లో శాసనసభ సచివాలయం యధావిధిగా పని చేస్తుందని. అన్ని స్థాయిల్లో ఉద్యోగులు తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని ఆదేశించారు.

కాగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన రోజునే బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరగనుంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు.సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అసెంబ్లి సమావేశాల నిర్వహణపై ప్రాధాన్యత సంతరించుకుంది. గడిచిన తొమ్మిదేళ్ళ పాలనలో చేసిన అభివృద్ధిని, సంక్షేమ రంగంలో సాధించిన విజయాలను ఉభయ సభల వేదికగా కేసీఆర్‌ సర్కారు ప్రజలకు వివరించనుంది.

- Advertisement -

అలాగే ప్రాధాన్యతా రంగాలను ఏ తరహాలో అభివృద్ధి చేశారో.. శాఖల వారీగా మంత్రులు వెల్లడించేందుకు సంసిద్ధమవుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రంగాల్లో స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తూ ప్రభుత్వ పరంగా ఇస్తున్న ఆర్థిక చేయూతను అసెంబ్లి సమావేశాల అజెండాలో ప్రధానాశంగా ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్న విపక్షాలను సభా నాయకుడిగా సీఎం కేసీఆర్‌ ఎండగట్టే అవకాశం ఉంది.

ఎన్నికల నేపథ్యంలో.. ఇవే చివరి సమావేశాలు

రాజ్యాంగ ప్రక్రియలో భాగంగా ప్రతి ఆరు నెలలకోసారి అసెంబ్లి ఉభయ సభలను సమావేశపర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అసెంబ్లి బడ్జెట్‌ సమావేశాలు ఈ ఏడాది గడిచిన ఫిబ్రవరి 12వ తేదీన ముగిశాయి. ఆర్నెళ్ల గడువు ప్రకారం ఆగస్టు 11లోపు ఉభయసభలు తిరిగి సమావేశం కావాల్సి ఉంది. దీంతో మూడో తేదీ నుంచి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్‌ లేదా డిసెంబర్‌ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇవే చివరి సమావేశాలు అయ్యే అవకాశం ఉంది. దీంతో ఎన్నికలే లక్ష్యంగా ఈ సమావేశాల్లో వివిధ అంశాలపై చర్చ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలపై ప్రకటన చేసే అవకాశం ఉంది. కొత్త బిల్లులు సహా గవర్నర్‌ తిప్పి పంపిన బిల్లులపై కూడా ఉభయసభల్లో చర్చించే అవకాశం ఉంది.

వ్యూహాలు రచిస్తోన్న ప్రతిపక్షాలు

ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షాలు ప్రత్యేక వ్యూహాలతో సిద్ధమై ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ప్రధానంగా నెలకొన్న సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తనున్నాయి. రాష్ట్రాన్ని చిగురుటాకులా వణికిస్తున్న భారీ వరదల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన సహాయక చర్యల అంశం, జీహెచ్‌ఎంసీ అభివృద్ధి.. ఇలా చాలా అంశాలు చర్చకు రానున్నాయి. ఎన్నికలకు ముందు ఈ సమావేశాలే చివరి సమావేశాలు కావడం వలన మంత్రులపై అవినీతి ఆరోపణలు, ఓఆర్‌ఆర్‌ -టె-ండర్‌ అంశాలు ఇలా పలు అంశాలు ఉభయ సభల్లో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి సమావేశాలు హాట్‌హాట్‌గా నడుస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement