Monday, April 15, 2024

TS – ఉచిత విద్యుత్ , రూ.500 గ్యాస్ ప‌థ‌కాల‌ను ప్రారంభించిన రేవంత్ ..

హైదరాబాద్ – ఉచిత‌ 200 యూనిట్ల విద్యుత్, ఐదు వందల గ్యాస్ సిలిండర్ పథకాలను నేడు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గ్యారంటీలు అమలు చేస్తున్నామన్నారు. ప్రజలకు కాంగ్రెస్ మాట ఇస్తే వెనకడుగు వేయదని, ఎన్నికల కోడ్ కారణంగా చేవెళ్ల సభలో ప్రారంభించాల్సిన పథకాలను, సచివాలయంలో ప్రారంభిస్తున్నామని తెలిపారు.అలాగే ప్రజా పాలనలో ఆరు పథకాలకు అప్లై చేసుకోని వారికి మరోసారి అవకాశం కల్పిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ లు ప్రకటించిందని, విప్లవాత్మక ఆలోచనలతో కూడిన నిర్ణయాలు కాంగ్రెస్ తీసుకుందన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తోందా అని రాష్ట్రం వైపు దేశం చూస్తుంద‌న్నారు.. ధనిక రాష్టాన్ని అప్పుల పాలు చేసింది బీఆర్ఎస్ అని ఆయన విమర్శలు గుప్పించారు. బ్యాంకుల నుంచి అప్పు తెచ్చి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు భట్టి. గ్యారెంటీలు అమలు చేయడం కోసం కసరత్తు చేస్తున్నామని, దుబారా తగ్గించుకున్నామన్నారు.

అక్కడ ఇక్కడ నిధులు జమ చేస్తుకుంటూన్నామని, సామాన్యులు, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్త పడుతున్నామన్నారు భట్టి విక్రమార్క. ఇది చారిత్రాత్మకమైన రోజు అని, ఆరు గ్యారెంటీల అమలు దేశానికి దశ దిశ నిర్దేశం చేస్తాయన్నారు. అసాధ్యాన్ని సాధ్యం చేయడమే నేటి ఇందిరమ్మ రాజ్యమని, ఎన్ని ఇబ్బందులు ఉన్న తూచా తప్పకుండా గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. 200 యూనిట్ల వరకు విద్యుత్ వాడుతున్నరో అందరికీ మార్చి నెలలో జీరో బిల్ ఇస్తామని, అర్హత కలిగిన వారికి ఎలాంటి ఆంక్షలు విధించడం లేదన్నారు భట్టి విక్రమార్క. గ్రామ సభల ద్వారా అర్హులను గుర్తించామ‌న్నారు. కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్నారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళలు ఎవరూ మర్చిపోలేని రోజు అని ఆయన వ్యాఖ్యానించారు. తెల్లకార్డు ఉన్న వారికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. గత మూడేళ్ళుగా యావరేజ్ గా ఎన్ని సిలిండర్లు వాడారో అన్ని సిలిండర్లు ఇస్తామని ఆయన వెల్లడించారు. సుమారు 40 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని, భవిష్యత్ లో తెల్ల కార్డు ఉండి ఎల్పీజీ కనెక్షన్ ఉన్న మిగతా వారికి కూడా ఇస్తామని ఆయన పేర్కొన్నారు. లబ్ధిదారుల జాబితాలోకి ఇప్పుడు లేని వారిని తర్వాత చేర్చుతామని ఆయన తెలిపారు.

మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చామని, ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు చేశామన్నారు. మరో రెండు గ్యారెంటీలు ఇప్పుడు అమలు చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో నూటికి నూరు శాతం మిగతా హామీలు అమలు చేస్తామన్నారు కొండా సురేఖ. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్న సీఎం, ఆమె స్ఫూర్తితో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని తెలిపారు. ఆరు గ్యారంటీలను కూడా కచ్చితంగా అమలు చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే 2 హామీలు అమలు చేశామని గుర్తు చేశారు. ఈ పథకంలో లోపాలు గుర్తించి మార్పులు చేసుకుంటూ ముందుకెళ్తామని వెల్లడించారు. పేదలకు ఎక్కువ ఉపయోగం కలిగేలా అభయ హస్తం గ్యారంటీలు ప్రకటించినట్లు పునరుద్ఘాటించారు.
ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు,, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, సీత‌క్క‌, స్పీక‌ర్ ప్రసాద్ రావు, రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement