Friday, May 3, 2024

TS | పాఠశాలల పని వేళలు మార్పు.. విద్యాశాఖ ఉత్తర్వులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో పాఠశాలల పనివేళలు మారుస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పాఠశాలలు ఉదయం 9 గంటలకు మొదలవుతున్నాయి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం 9.30 గంటలకి మార్చింది. 1 నుంచి 5వ తరగతి వరకు చదివే ప్రాథమిక పాఠశాలల సమయం ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.15 వరకు మార్చింది. ప్రాథమికోన్నత పాఠశాలలు (6 నుంచి 10వ తరగతి) ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 వరకు పనిచేయాలని ఆదేశించింది.

ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 1 నుంచి 5 తరగతి వరకు ఉండే ప్రాథమిక పాఠశాలలు కూడా ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.15 వరకు పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన ఉత్తర్వులను సోమవారం జారీ చేశారు. అయితే హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లో మినహా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు ఇవే పనివేళలు పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లో పాత పనివేళలే కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

- Advertisement -

ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పాఠశాలల పనివేళలు మార్చుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొన్ని సంఘాలు స్వాగతిస్తుంటే మరికొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. పీఆర్టీయూటీఎస్‌ సంఘం దీన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేసింది. టీఎస్‌ యూటీఎఫ్‌, టీఆర్టీఎఫ్‌తో పాటు మరికొన్ని సంఘాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. పనివేళలు ఉదయం 9 గంటలకు బదులు 9.30 గంటలకు ప్రారంభించటం ఆశాస్త్రీయమని పేర్కొన్నాయి. పనివేళలు మార్చాలంటే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇతర భాగస్వాముల అభిప్రాయాలను సేకరించి నిర్ణయించాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement