Sunday, June 20, 2021

ఈటలకు ఆత్మగౌరవం ఉందా?

టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై గులాబీ దళం మాటల దాడి మొదలు పెట్టింది. మంత్రులు, నాయకులు ఈటలపై విమర్శలకు పదును పెట్టారు. మంత్రులను కేసీఆర్ బానిసలుగా చూస్తున్నారని… 19 ఏళ్లుగా టీఆర్ఎస్ లో ఉన్న తనను కూడా అగౌరవపరిచారని సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి ఈటల మండిపడ్డారు. తాను బానిసను కాదనీ, ఉద్యమ సహచరుడినని ఆయన చెప్పారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈటల రాజేందర్‌కు ఆత్మగౌరవం ఉందా? అని మంత్రి గంగుల కమలాకర్‌ ప్రశ్నించారు. ఏడేళ్లుగా బానిస బతుకు గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. పదవిపోగానే ఈటలకు ఆత్మగౌరవం గుర్తొచ్చిందా? అని అడిగారు. ఆస్తుల పరిరక్షణ కోసమే ఈటల ఢిల్లీకి వెళ్లాడని, ఈటల ఏం హామీలతో బీజేపీలోకి వెళ్తున్నారని ప్రశ్నించారు. ఈటల చెప్పేవన్నీ అబద్దాలేనని విమర్శించారు. వ్యక్తిగత అవసరాలు తప్ప బీసీల కోసం ఏనాడూ మాట్లడలేదని గంగుల దుయ్యబట్టారు.

ఈట‌ల ఎపిసోడ్‌పై స్పందించిన మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్.. ఈటల ఆత్మ గౌరవం కోసం కాదు… ఆత్మ రక్షణ కోస‌మే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశార‌ని ఆరోపించారు. స్వప్రయోజ‌నాల కోసం తెలంగాణ ప్రయోజనాలకు అడ్డు పడే బీజేపీ కాళ్ల వ‌ద్ద ఆత్మగౌరవాన్ని ఈటల తాక‌ట్టుపెట్టార‌ని విమర్శించారు. సీఎం కేసీఆర్ పై ఈటల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈటల రాజేందర్ రాజీనామా చేస్తూ పార్టీకి ఎంతో సేవ చేశారన్నారు. ఆత్మ గౌరవంతో ఉండే వారికి అవమానం జరిగింది అంటున్నార‌ని.. పార్టీకి, ప్రజలకు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటే తొలగించార‌న్నారు. ఐదేళ్లుగా అవమానం జరుగుతుందని అన్నారని, మరి ఐదేళ్లుగా ఆత్మగౌరవం కోసం పాటుపడక ఈరోజు వరకు ఎందుకు ఉన్నారు? అని ప్రశ్నించారు.

ఈటల రాజేందర్‌కు ఎంతో గౌరవం ఇచ్చారని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. రాజేందర్‌ పార్టీలో కీలకమైన పదవులతో పాటు రెండుసార్లు మంత్రిగా చేశారని గుర్తు చేశారు. ఆత్మగౌరవం దెబ్బతిన్నట్లు ఆయన మాటల్లో ఎక్కడా కనబడటం లేదన్నారు. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను సమావేశంలో అంగీకరించి బయటకు రాగానే వ్యతిరేకంగా మాట్లాడం సరైనదేనా అని ప్రశ్నించారు. కేబినెట్‌ నిర్ణయాలు నచ్చకపోతే సమావేశంలోనే నోట్‌ చేయొచ్చని, అంతగా నచ్చకపోతే రాజీనామా చేయాల్సిందని పేర్కొన్నారు. ఐదేళ్ల నుంచి ఈటల అసంతృప్తిగా పార్టీలో ఎందుకు ఉన్నారని నిలదీశారు. టీఆర్‌ఎస్‌లో ఈటల ఏనాడూ అవమానాలు ఎదుర్కోలేదన్నారు. ఐదేళ్ల నుంచి ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా? అని కొప్పుల ప్రశ్నించారు. ఎక్కువ భూములు ఉన్నవారు రైతుబంధును తిరిగి ఇచ్చారని, ఈటల కుటుంబం ప్రతీ ఏడాది రూ.3.52లక్షల రైతుబంధు సొమ్ము తీసుకుంటున్నదని మంత్రి కొప్పుల ఆరోపించారు. ఆత్మ రక్షణ లేదా ఆస్తుల రక్షణ కోసమే ఈటల బీజేపీలో చేరుతున్నారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News