Tuesday, June 18, 2024

MLC KAVITHA : వెయ్యి బుల్‌డోజ‌ర్లు వచ్చినా కారు స్పీడ్ ను ఆపలేరు .. ఎమ్మెల్సీ క‌విత‌

నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభ న్యూస్)27: రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ పార్టీ వెంటబడి మరీ నిలిపివేయించిందని, రైతుల నోటి కాడి బుక్కను లాక్కొని ఆ పార్టీ రైతు వ్యతిరేకతను చాటుకుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. రైతు బంధు ఇప్పటికే అమల్లో ఉన్న పథకమని, 10 సార్లు రైతు బంధ పథకం కింద రైతుల ఖాతాలో ప్రభుత్వం డబ్బు జమా చేసిందని గుర్తు చేశారు. అది ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టకున్నా ప్రవేశపెట్టిన పథకం అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటబడి రైతు బంధు పథకాన్ని ఆపించారని మండిపడ్డారు. నిజామాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడారు. ఈ పథకం కింద 65 లక్షల మంది రైతులకు రూ. 72 వేల కోట్ల మేర నిధులను ఇచ్చామని, దాంతో రైతులు బీఆర్ఎస్ వైపు ఉన్నారన్న అభద్రతతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతు వ్యతిరేకతను చాటుకున్నారని, రైతుల నోటికాడి బుక్కను గుంజుకున్నారని నిప్పులు చెరిగారు. రైతురుణ మాఫీని ఆపిందని, రైతు వ్యతిరేక వైఖరిని కాంగ్రెస్ పార్టీ మరోసారి రుజువు చేసుకుందని స్పష్టం చేశారు. నోటికాడి బుక్కను గుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీని గుర్తుకు తెచ్చుకొని ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసి తగిన బుద్దిచెప్పాలని రైతులకు పిలుపునిచ్చారు

.గత ఐదారు రోజులుగా ప్రధాని, ఇతర రాష్ట్రాల సీఎంలు, కాంగ్రెస్ అగ్రనాయకులు వచ్చి ప్రచారం చేస్తున్నారని, పంటలు మంచి చేతికొచ్చే సమయంలో మిడతల దండు వచ్చి పంటలను ఎలా నాశనం చేస్తుందో అలా తెలంగాణ మీద పడడానికి వస్తున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన నాడు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ఎక్కడున్నారని ప్రశ్నించారు. సకల జనల సమ్మె, పెన్ డౌన్, గన్ డౌన్ వంటి కార్యక్రమాలు చేపట్టి తండ్లాడి తెలంగాణను తెచ్చుకున్నామని, రాష్ట్రం వచ్చిన తర్వాత పార్లమెంటులో కాంగ్రెస్ నాయకులు ఆంధ్రా హక్కుల గురించి మాట్లాడారు కానీ తెలంగాణ హక్కు గురించి మాట్లాడలేదని తెలిపారు. తెలంగాణలోని 7 మండ లాలను అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఆంధ్రలో కలిపినప్పుడు, కేంద్రం విభజన హామీలను అమలు చేయక పోతే కాంగ్రెస్ నాయకులకు మాట్లాడడానికి నోరు రాలేదని మండిపడ్డారు.

తెలంగాణ ఏర్పాటును అవహేళన చేస్తూ పార్లమెంటులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడి నప్పుడు సోనియా గాంధీ అక్కడే ఉన్నా అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసి తెలంగాణకు వచ్చినప్పటికీ ఇక్కడి అంశాలను ప్రస్తావించలేదని ఆక్షేపించారు.బీజేపీ ఎప్పుడూ అబద్దాలు చెప్పిందే కానీ ఒక్కసారి కూడా నిజం చెప్పలేదని, తెలంగాణలో ఉన్న శాంతిసామరస్యాలను పాడుచేయడానికి ఆ పార్టీ నాయకులు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని తెలిపారు. ఒకరు భాగ్యలక్ష్మీ దేవాలయం అంటారు… మరొకరు భైంసాకు వెళ్లి ఏదో చేస్తామంటారు తప్పా ఎప్పుడు కూడా మనకు భరోసా, భద్రత ఇచ్చేలా, మన అస్థిత్వాన్ని కాపాడడానికి ఏనాడు బీజేపీ ప్రయత్నం చేయలేదని స్పష్టం చేశారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోని నాయకులు, పార్లమెంటులో పెదవి విప్పని నాయకులు, అవసరము న్నప్పుడు తెలంగాణకు నయాపైసా ఇవ్వని వాళ్లు మనకు అవసరమా అన్నది ఆలోచించాలని కోరారు.

కులం పేరు చెప్పి కుతంత్రం
మతం పేరు చెప్పి మంటలు పెట్టాలని ఒక పార్టీ చూస్తోందని, మరొక పార్టీ కులం పేరు చెప్పి కుతంత్రం చేసే ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. తెలంగాణ కోసం కోట్లాడే సమయంలో ఎవరిదే కులం, మతం అని అనుకో లేదని, ఇప్పటికీ అందరం కలిసిమెలసి ఉన్నామని తెలిపారు. తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం జరిగితే ముస్లీంలకు ఎంత నష్టం జరుగుతుందో హిందువులకు కూడా అంతే నష్టం జరుగుతుందని చెప్పారు. ఈ ఆలోచన లేక కొన్ని పార్టీలు ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నాయని విమర్శించారు.

- Advertisement -

మంచొళ్లు కావాలా ముంచేటొళ్లు కావాలా ?

మంచొళ్లు కావాలా ముంచేటొళ్లు కావాలా అన్నది తేల్చుకునే సందర్భం వచ్చింది. 24 గంటల కరెంటు ఇచ్చెవాళ్లు కావాలా లేదా 3 గంటల కరెంట్ ఇచ్చేవాళ్లు కావాలా తేల్చుకునే సమయం వచ్చింది. రైతు బంధు కావాలా లేదా రాబందు కావాలా, ఇరిగేషన్ కావాలా లేదా మైగ్రేషన్ కావాలా అన్నది తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. మానవీయ కోణంతో ఆలోచించే సీఎం కేసీఆర్ పై అభాండాలు వేస్తూ, పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తూ దండయాత్రకు వచ్చిన మిడతల దండు పనిపట్టాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ వచ్చి తెలంగాణలో బుల్డోజర్ నడపాల్సిన సమయం వచ్చిందని అంటున్నారని, వెయ్యి బుల్డోజర్లు నడిపినా వాటిపై దాడి చేయడానికి కారు సిద్ధంగా ఉందని అన్నారు.

“బుల్డోజర్లు నడపడం మా ఆలోచన కాదు. పోలాల్లో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు నడవాలన్నదే మా ఆలోచన. సాగు, తాగు నీళ్లు అందించాలన్నది, పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలన్నది, అభివృద్ధి మా ఆలోచనలు. మీ లాగా ఇళ్లను కూల్చివేయడం మా ఆలోచన కాదు. ఇళ్లు నిర్మించడం మా ఆలోచన.” అని వ్యాఖ్యానించారు. తెలంగాణ పునాదులను బలంగా వేశామని, చాలా పనులు చేశామని, ఇంకా చేయాల్సింది ఉందని తెలిపారు. ట్రైలర్ చూసి భయడుతున్నారని, తెలంగాణ మంచి ఉన్నత స్థానానికి చేరుకుంటుందని స్పష్టం చేశారు. కేవలం ట్రైలర్ చూసే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు భయపడ్డాయని, సినిమా ఇంకా మిలిగే ఉందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మూడో సారి కచ్చితంగా అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. షాదీ బుబారక్, కళ్యాణ లక్ష్మి వంటి పథకం ఏ ప్రభుత్వమైనా అమలు చేసిందా అని ప్రశ్నించారు. బీజేపీతో సీఎం కేసీఆర్ చేతులు కలిపారని కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తున్నదని, ఏ అంశంలో చేతులు కలిపారన్నది కాంగ్రెస్ నాయకులను అడగాలని ప్రజలను కోరారు. ట్రిపుల్ తలాక్ బిల్లు పార్లమెంటుకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసిందా లేదా చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ తీసుకొచ్చిన జీఎస్టీ బిల్లుకు కాంగ్రెస్ మద్ధతివ్వలేదా ? వాట్సప్ లో బీజేపీ పార్టీ అబద్దాలను ప్రచారం చేస్తున్నదని, వాటిని నమ్మవద్దని సూచించారు.

కేవలం అధికారంలోకి రావాలన్నదే ఆరాటమే…
కేవలం అధికారంలోకి రావాలన్నది కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఆరాటమని, ఆ పార్టీలు పొరపాటున అధికారంలోకి వస్తే ఏ నాయకుడూ ప్రజలకు కనిపించరని అన్నారు. ఢిల్లీ నుంచి వస్తున్న నాయకులు ప్రచారం చేసుకొని తిరిగి ఢిల్లీకే వెళ్తారని, కానీ సీఎం కేసీఆర్ ఇక్కడే ఉండి ప్రజల బాగోగులు చూసుకుంటారని తెలిపారు. కాబట్టి ఎవరినో సీఎం చేయడానికి ఓటు వేయడం కాకుండా మంచి భవిష్యత్తు కోసం ఓటు వేయాలని, మంచి భవిష్యత్తు ఇచ్చే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ 55 పరిపాలించి కనీసం తాగడానికి మంచినీళ్లు, కరెంటు ఇవ్వలేకపోయిందని చెప్పారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కనిపించని శతృవు అని, బీజేపీ బహిరంగ శతృవు అని తేచ్చిచెప్పారు. సెక్యులర్ పేరిట కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. అలాగే, నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీ రౌడీయిజం, గూండాయిజం చేస్తున్నదని, తమ పార్టీ అభ్యర్థులపై దాడులు చేస్తోందని ధ్వజమెత్తారు. పోలీసుల పేర్లను రెడ్ డైరీలో రాస్తామని చెప్పడంతో పాటు తరతరాలుగా కాంగ్రెస్ పార్టీ చేసిన గూండాయిజాన్ని మళ్లీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నదని చెప్పారు.

ఉపాధి హామీ కార్మికుల పొట్టకొడుతున్న బీజేపీని కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నించడం లేదు?

ఉపాధి హామీ కార్మికులకు సగటున రోజుకు రూ. 150 వేతనం కూడా రావడం లేదని, నిధుల్లో కోత విధిస్తుంటే, ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని కాంగ్రెస్ పార్టీ నిలదీశారు. వేలాది మంది ఉపాధి హామీ కార్మికుల పొట్టకొడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఎందుకు లేదని అడిగారు. తమ పార్టీ ఎంపీలు ఈ అంశంపై కేంద్రం మీద పోరాటం చేశామని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగులకు మంచి జీతాలను అందిస్తున్నామని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించామని, ఒక్క విద్యుత్తు శాఖలోనే 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు క్రమబద్ధీకరించామని వివరించారు. అత్యధికంగా 43 శాతం పీఆర్సీ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దని, 5 శాతం మధ్యంతర ఐఆర్ ఇచ్చుకున్నామని పేర్కొన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీ, ఫిట్ మెంట్ వస్తుందని వెల్లడించారు. ఏ రాష్ట్రం చేయని విధంగా అంగన్ వాడీ, ఆశా వర్కర్లకు జీతాలను పెంచామని చెప్పారు. పేదలు, కూలీలు, మధ్యతరగతి వారిపై బీజేపీ ప్రభుత్వానికి పట్టింపులేదని, కేవలం కార్పొరేట్లకు, పెద్ద కంపెనీలకు లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయడమే కేంద్ర ప్రభుత్వం పనిగా పెట్టుకుందని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వంలో పెద్దపెద్ద కంపెనీలే బాగుపడ్డాయని చెప్పారు.

బొగ్గు గనిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిందే కాంగ్రెస్

సింగరేణిని ప్రైవేటీకరించడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తు న్నారని ప్రియాంకా గాంధీ ఆరోపించారని, ప్రియాంకా గాంధీ మాటలు వింటే నవ్వాలో, ఏడ్వాలో అర్థంకాని పరిస్థితి అని అన్నారు. తాడిచెర్ల బొగ్గు గనిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిందే కాంగ్రెస్ పార్టీ అని ఎండగట్టారు. సింగరేణిని కూడా ఎంతో అభివృద్ది చేశామని వివరించారు. దాదాపు 25 వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చామని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకున్నామని ప్రస్తావించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని, ప్రభుత్వ రంగ సంస్థల విక్రయానికి కూడా వ్యతిరేకమని ప్రకటించారు.

10 లక్షల ఉద్యోగాల భర్తీపై బీజేపీని యువత ప్రశ్నించాలి

దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనన్ని ప్రభుత్వ ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందని, 2.32 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని తెలియజేశారు. కానీ కేంద్రంలో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలకు బీజేపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం లేదని ఎండగట్టారు. ఒక్క రైల్వే శాఖలోనే 3.3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, రక్షణ శాఖలో 3.5 లక్షలు, పోస్టల్ శాఖలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన, వాటిని ఎందుకు భర్తీ చేయడం లేదని బీజేపీ నాయకులను యువత ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాలు భర్తీ చేస్తే అందులో తెలంగాణ వాళ్లకు కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.

నిజామాబాద్ ను అద్భుతంగా అభివృద్ధి చేశాం

నిజామాబాద్ లో ఉన్నమా లేదా హైదరాబాద్ లో ఉన్నామా అనుకునేంత స్థాయిలో నిజామాబాద్ ను అభివృద్ధి చేశామని వివరించారు. నిజామాబాద్ నగరం ఇప్పుడు అద్భుతంగా తయారయ్యిందని చెప్పారు. తెలంగాణ రాక ముందు నీళ్లు లేక ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చేవారని, అప్పటి పాలకులు రెండు డ్రమ్ముల నీళ్లు మాత్రమే ఇచ్చేవాళ్లని గుర్తు చేశారు. నీటి ట్యాంకర్ల కోసం ప్రజల ఒత్తిడి భరించలేక చాలా మంది అప్పటి ప్రజాప్రతినిధులు రాజకీయాలు వదిలేసిన పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రతి ఇంటికి మంచినీళ్లు, ప్రతి గల్లీకి రోడ్డు వంటి అనేక సౌకర్యాలు వచ్చాయన్నారు. ఈ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బీగాల ,మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు అలీమ్, ఖూ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement