Monday, May 6, 2024

ప్రత్యక్ష నియామకాల గరిష్ట వయో పరిమితి 10ఏళ్లు పెంపు.. 34నుంచి 44 ఏళ్లకు పెంచుతూ అడ్‌హాక్‌ ఉత్తర్వులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ట వయో పరిమితిని 10ఏళ్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న గరిష్ట వయో పరిమితిని 34ఏళ్లనుంచి 44 ఏళ్లకు పెంచుతూ ఆదేశాలు వెల్లడించింది. ఈ మేరకు జీవో 42ను జారీ చేసింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత భారీగా కొలువుల భర్తీకి సీఎం కేసీఆర్‌ శాసనసభలో చేసిన ప్రకటన సందర్భంగా పోలీస్‌ శాఖ వంటి యూనిఫాం సర్వీసెస్‌ మినహా ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని పదేళ్లకు పెంచుతామని హామీనిచ్చారు. ఈ నేపథ్యంలో సాధారణ పరిపాలన శాఖ అందుకు అనుగుణంగా వయో పరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో లక్షలాది మంది నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉత్తర్వుల అమలుతో ఇకపై నియామకాల్లో ఓసీలకు 44 ఏళ్లకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్లకు, దివ్యాంగులకు 54 ఏళ్లకు ఉద్యోగ గరిష్ట వయోపరిమితి పెరగనున్నది.

సుధీర్ఘ కాలం తర్వాత 80,039 ఖాళీల భర్తీకి సర్కార్‌ నిర్ణయించడంతో నిరుద్యోగ యువత వయో పరిమితిని పెంచాలని కోరుతూ ప్రభుత్వానికి పలు రకాలుగా విజ్ఞప్తులు చేసింది. ప్రత్యక్ష నియామకాల్లో పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను విస్తృతం చేసే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ వారి విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామక ప్రక్రియలో వయో పరిమితి పెంపుతో మరింత మంది అర్హులైన యువతకు అవకాశం కల్పించాలన్న లక్ష్యంతో తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌లో మార్పులు చేసింది. తాత్కాలిక నిబంధనల్లో భాగంగా ఈ ఉత్తర్వులు రెండేళ్లపాటు అమలులో ఉండనున్నాయి. ఈ ఉత్తర్వులు పోలీస్‌, ఎక్సైజ్‌, అగ్నిమాపక, జైళ్ల శాఖ, అటవీ వంటి యూనిఫాం సర్వీసులకు వర్తించదని ప్రభుత్వం వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement