Sunday, April 28, 2024

Telangana – ప్రాజెక్టు కోసం పక్కా ప్రణాళిక – కోడ్‌ ముగియగానే మరాఠాలతో చర్చలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాలు మారుతున్నాయే కానీ కొత్తగా తలపెట్టిన ప్రాజెక్టులు ముందుకు కదలక పోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. మహారాష్ట్ర తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టుగా నాడు తలపెట్టిన లెండి మధ్య తరహా ప్రాజెక్టు నిర్మాణం కోసం నీటిపారుదల శాఖ అంచనావ్యయాలను సిద్ధం చేసింది. ఎన్నికల కోడ్‌ ముగియగానే మహారాష్ట్ర తో చర్చలు జరిపి ప్రాజెక్టును నిర్మించేందుకు రాష్ట్ర నీటి పారుదల శాఖ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లుతోంది.

స‌స్య‌శ్యామలం కానున్న క‌ల్లోలిత ప్రాంతాలు

ప్రాజెక్టు పూర్తి అయితే.. కల్లోలిత ప్రాంతాలను సస్యశ్యామలం చేసి యువతను తీవ్రవాదం వైపు నుంచి మళ్లించేందుకు ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. కాగా, మహారాష్ట్ర, ఏపీ సరిహద్దుల్లో నిర్మాణం తలపెట్టిన ఈ లెండి ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. 2003లో నాటి తెలుగుదేశం ప్రభుత్వం మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుని 18నవంబర్‌ 2003లో 49 వేల ఎకరాలకు సాగునీటి ప్రతిపాదనతో లెండి ప్రాజెక్టు పనులను ప్రారంభించింది.

రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో నిర్మాణం

మహారాష్ట్ర , ఆదిలాబాద్‌ సరిహద్దుల్లోని గొనెగాం దగ్గర ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టారు.రాష్ట్ర వాటాగా రూ. 236 కోట్లు ఇచ్చేందకు ఒప్పందం కుదిరింది. ప్రాజెక్టు అంచనావ్యయంలో ఏపీ-మహా రాష్ట్ర మధ్య 38: 62నిష్పత్తిలో అంగీకారం కుదిరింగి. ఈ ఒప్పందం మేరకు మొదట హెడ్‌ వర్క్స్‌ పనులు ప్రారంభించారు. అనంతరం ఏర్పడిన ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించడంలో ఏపీ మహా రాష్ట్ర మధ్యల అవగాహన ఒప్పందం జరగపోవడంతో ప్రాజెక్టు పనులు ఎక్కడి కక్కడే నిలిచి పోయాయి. ఆతర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం ప్రాజెక్టు పునరుద్ధరణకు జీఓ ఆర్‌ టీ నం 867 సిద్ధమై నప్పటికీ అంతరాష్ట్ర ఒప్పందాలు జరగపోవడంతో 25.14 కిలో మీటర్లు పొడవున తవ్విన కాలువలకు లైనింగ్‌, సీఎం అండ్‌ సీడీ పనులు జరగపోవడంతో కాలువల్లో తిరిగి పూడికలు తీసే పరిస్థితి నెలకొంది.

- Advertisement -

లెండిపై దృష్టి సారించిన ఇరిగేషన్‌ శాఖ

2003 నుంచి పెండింగ్‌ లో ఉన్న పనులు పూర్తి చేస్తే వెనుకబడిన ఆదిలాబాద్‌, నిజమాబాద్‌ సరిహద్దు జిల్లాల్లో 22 వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశాలను నీటిపారుదల శాఖ అధికారులు సమీక్షించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల సమర్పించారు. భూసేకరణ అంశం పరిశీలనతో పాటుగా పెండింగ్‌ పనులు పూర్తి చేసేందుకు అంచనా వ్యాయాలను సిద్ధం చేసింది. త్వరలో మహారాష్ట్ర నీటిపారుదల శాఖతో చర్చలు జరిపి పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఇప్పటివరకు కేవలం వర్షాధార పంటలపైనే ఆధారపడిన అనేక ప్రాంతాలు సస్యశ్యామలమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉండటంతో తాజాగా నీటిపారుదల శాఖ రూపొందించిన అంచనా వ్యయం రూ. 560 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వంఅనుమతి ఇచ్చినట్లు తెలిసింది. ఎన్నికల కోడ్‌ ముగియగానే ఈమేరకు ఉత్తర్వులు వెలుబడే అవకాశాలున్నాట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement