Tuesday, October 8, 2024

Exclusive – ఆశ‌ప‌డితే భంగ‌పాటు! ఇప్పటి వరకు 71వేల మంది డిపాజిట్లు గల్లంతు


ఎన్నికలలో పోటీ చేయడం ఓ సవాల్‌. పేరుతోపాటు పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం కూడా. ఓటమి కూడా గెలుపులాగే ఉండాలని అందరూ కోరుకుంటారు. గట్టి పోటీ ఇచ్చాడు.. గెలిచి ఓడాడు..అని నలుగురూ అనుకునేలా పోటీ ఇవ్వాలని బరిలోకి దిగిన ప్రతి ఒక్కరూ కోరుకునే సంగతి. ఎన్నికల పోటీలో గౌరవానికి కనిష్ట కొలమానం డిపాజిట్‌ దక్కించుకోవడం. గెలిచిన అభ్యర్థికి పోలైన ఓట్లలో నిర్దిష్ట శాతం ఓట్లను పొందగలిగితే రాజకీయాల్లో పరువు నిలుపుకున్నట్లుగానే భావిస్తారు. ముందుగా ఎన్నికల్లో పోటీ చేయాలంటే సదరు అభ్యర్థి నామినేషన్‌ పత్రం దాఖలు చేయాలి. దానితోపాటే సెక్యూరిటీ డిపాజిట్‌ (నగదు మొత్తం) కట్టాలి. ఇది సాధారణ మొత్తం కావడంతో చాలా మంది సరదాగా కూడా పోటీ చేస్తుంటారు.

లోక్‌స‌భ‌కు పోటీప‌డే వారి సంఖ్య ఎక్కువే..

దేశవ్యాప్త ఎన్నికలైన లోక్‌సభ పోలింగ్‌లో ఇలాంటి వారి సంఖ్య భారీగానే ఉంటుంది. వీరిలో చాలా మందికి డిపాజిట్‌ కూడా దక్కదు. భారతదేశ ఎన్నికల చరిత్రలో (లోక్‌సభ ఎన్నికలు) ఇలా డిపాజిట్లు కోల్పోయిన వారి సంఖ్య 71,000 మంది ఉన్నారంట. గెలిచిన అభ్యర్థిలో ఆరో వంతు ఓట్లు పడితేనే ఓడిన అభ్యర్థికి డిపాజిట్‌ వాపస్‌ ఇస్తారు. కానీ ఒకవేళ ఆరో వంత ఓట్లు పోలవ్వకుంటే, ఆ అభ్యర్థి డిపాజిట్‌ గల్లంతైనట్టే. లోక్‌సభ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, జాతీయ పార్టీలకు చెందిన నేతలు తమ డిపాజిట్‌ను ఎక్కువ శాతం దక్కించుకోగలిగారని అసోసియేట్ ఫ‌ర్ డెమోక్రాటిక్ రిఫార్మ్‌ (ఏడీఆర్‌) ట్రస్టీ సభ్యుడు జగదీప్‌ చోకర్‌ తెలిపారు.

= 2019 ఎన్నికల్లో సుమారు 85 శాతం మంది అభ్యర్థులు డిపాజిట్‌ కోల్పోయారు. పోలైన ఓట్లలో ఆరోవంతు ఓట్లు రాకుంటే అప్పుడు ఆ డిపాజిట్‌ అమౌంట్‌ను ప్రభుత్వ ట్రెజరీకి మళ్లిస్తారు.

= ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా తొలి లోక్‌సభ ఎన్నికల నుంచి 91,160 అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. దాంట్లో 71,246 మంది తమ సెక్యూర్టీ డిపాజిట్‌ను కోల్పోయారు. ఆ సంఖ్య 78 శాతం ఉన్నట్లు ఈసీ డేటా ద్వారా తెలుస్తోంది.

- Advertisement -

= 1951లో జనరల్‌ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీలకు రూ.250 సెక్యూర్టీ డిపాజిట్‌ ఉండేది. ప్రస్తుతం ఈ మొత్తాన్ని 25 వేలు, రూ.12,500కు పెంచారు.

= 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులు అత్యధికంగా డిపాజిట్లు కోల్పోయారు. 383 మంది అభ్యర్థుల్లో 345 మందికి డిపాజిట్‌ దక్కలేదు. ఆ తర్వాత జాబితాలో కాంగ్రెస్‌ పార్టీ ఉన్నది. ఆ పార్టీ తరపు 421 మంది పోటీ చేయగా, దాంట్లో 148 మందికి డిపాజిట్‌ రాలేదు.

= 1951-52 లోక్‌సభ ఎన్నికల్లో 40 శాతం మంది డిపాజిట్‌ కోల్పోయారు. 1874 మంది అభ్యర్థులు పోటీపడితే దాంట్లో 745 మందికి డిపాజిట్‌ దక్కలేదు. అయితే ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో ఈ ట్రెండ్‌ పెరిగింది.

= 1996లో జరిగిన 11వ లోక్‌సభ ఎన్నికల్లో 13952 మంది అభ్యర్థులు పోటీపడగా, దాంట్లో 12,688 మందికి డిపాజిట్‌ రాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement