Monday, June 17, 2024

Telangana – ఆ 32 వేల ఉద్యోగాలు ఇచ్చింది మేమే …. నోటిఫికేషన్ నుంచి రిజల్ట్ వరకు వివరాలు ఇచ్చిన కెటిఆర్

మొత్తం ఉద్యోగ భ‌ర్తీ సమాచారం ఇచ్చిన కేటీఆర్‌
నియ‌మాక ప‌త్రాలు ఇచ్చి.. ఆ ఘ‌న‌త కొట్టేస్తున్న‌ రేవంత్
ఇదిగో లెక్క‌ల వాస్త‌వాలు.. వివ‌రించిన మాజీ మంత్రి
అధికారంలోకి వ‌చ్చి ఆరు నెల‌లైంది..
రెండు ల‌క్ష‌లు ఉద్యోగాలు భ‌ర్తీ ఎప్పుడు..
మంత్రి కోమ‌టిరెడ్డి ఓ జోక‌ర్
కీల‌క వ్యాఖ్య‌లు చేసిన కేటీఆర్‌

రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చాక 32 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేశామ‌ని చెప్పుకుంటున్న రేవంత్ స‌ర్కార్‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప‌డ్డారు. ఆ 32 వేల ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించిన వివ‌రాల‌ను కేటీఆర్ బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. ఈ ఉద్యోగాల‌కు రేవంత్ కేవ‌లం నియామ‌క ప‌త్రాలు మాత్ర‌మే అంద‌జేసిన‌ట్లు కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. 32,517 ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆరేన‌ని కేటీఆర్ తేల్చిచెప్పారు. తెలంగాణ భ‌వ‌న్‌లో శ‌నివారం మీడియాతో మాట్లాడుతూ.. తాము అధికారంలోకి 30 వేల ఉద్యోగాలు ఇచ్చాన‌ని రేవంత్ రెడ్డి, మంత్రులు ఊద‌ర‌గొడుతున్నారు. మీరు 30 వేల ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్త‌వం అయితే ఏ తేదీన నోటిఫికేస‌న్ ఇచ్చారు. రాత‌ప‌రీక్ష ఎప్పుడు నిర్వ‌హించారు. ఫ‌లితాలు ఎప్పుడు ఇచ్చారో తెలంగాణ నిరుద్యోగుల‌కు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నాను. కానీ వారు చెప్ప‌రు. ఉద్యోగాల భ‌ర్తీ విష‌యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇష్ట‌మొచ్చిన‌ట్టు అబ‌ద్దాలు చెబుతున్నారు. 32 వేల ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించిన వివ‌రాలను వెల్ల‌డిస్తున్న‌ట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

గురుకుల టీచ‌ర్ల భ‌ర్తీకి 2023లోనే నోటిఫికేష‌న్‌..

గురుకులాల్లో 9,210 టీజీటీ, పీజీటీ పోస్టుల భ‌ర్తీకి ఏప్రిల్ 2023లో నోటిఫికేష‌న్ ఇచ్చారు. ఆగ‌స్టు 2023లో రాత‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఫ‌లితాలు మాత్రం ఫిబ్ర‌వ‌రి 2024లో విడుద‌ల‌య్యాయి. ఈ పోస్టుల భ‌ర్తీని కూడా త‌న ఖాతాలో వేసుకోవ‌డం రేవంత్ రెడ్డి రాజ‌కీయ దివాలాకోరు త‌నానికి నిద‌ర్శ‌నం అని చెప్పొచ్చు.
పోలీసు శాఖ‌లో 17,516 ఉద్యోగాల‌కు ఏప్రిల్ 2022లో నోటిఫికేష‌న్ ఇచ్చాం. జూన్ 2023లో రాత‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించాం. అక్టోబ‌ర్ 4, 2023లో ఫ‌లితాలు వ‌చ్చాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల కోడ్ రావ‌డంతో భ‌ర్తీ ప్ర‌క్రియ ఆగిపోయింది. పోలీసు ఉద్యోగాల భ‌ర్తీ కేసీఆర్ హ‌యాంలోనే జ‌రిగింది. రేవంత్ రెడ్డి నియామ‌క ప‌త్రాలు ఇచ్చి బుకాయించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. 5,204 స్టాఫ్ న‌ర్సు ఉద్యోగాల భ‌ర్తీకి డిసెంబ‌ర్ 2022లో నోటిఫికేష‌న్ జారీ చేసి, ఆగ‌స్టు 2, 2023న రాత‌ప‌రీక్ష నిర్వ‌హించాం. డిసెంబ‌ర్ 23, 2023న ఫ‌లితాలు ప్ర‌క‌టించాం. ఇవి కూడా తానే ఇచ్చిన‌ట్టు రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారు.

కొన్ని కార‌ణాల‌తో ఆగిపోయాయి..

587 ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టుల‌కు ఏప్రిల్ 2022లో నోటిఫికేష‌న్ జారీ అయింది. ఏప్రిల్ 2023లో రాత‌ప‌రీక్ష నిర్వ‌హించి, ఆగ‌స్టు 7 2023లో ఫ‌లితాలు ప్ర‌క‌టించాం. కానీ న్యాయ‌ప‌ర‌మైన చిక్కుల వ‌ల్ల నియామ‌క ప‌త్రాలు ఇవ్వ‌లేక‌పోయాం. ఈ ఉద్యోగాల‌కు రేవంత్ కేవ‌లం నియామ‌క ప‌త్రాలు మాత్ర‌మే ఇచ్చారు. 32 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేసింది మాత్రం కేసీఆర్ అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. తొమ్మిదిన్న‌రేండ్ల కాలంలో 1.60 ల‌క్ష‌ల ఉద్యోగాలు పూర్తిస్థాయిలో భ‌ర్తీ చేయ‌గా, 32 వేల ఉద్యోగాలు కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆగిపోయాయి. ఇవి అవి మొత్తం క‌లుపుకుంటే కేసీఆర్ భ‌ర్తీ చేసిన ఉద్యోగాలు ఒక ల‌క్షా 92 వేల పైచిలుకు ఉద్యోగాలు అని కేటీఆర్ తెలిపారు.

మంత్రి కోమ‌టిరెడ్డి జోక‌రే…

ఇదివరకు కేఏ పాల్‌పై అందరూ జోకులు వేసేవారని త్వరలో కోమటిరెడ్డిపై జోకులు వేసే పరిస్థితి వస్తుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. టిమ్స్ ఆసుపత్రిపై మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఒక మంత్రి హోదాలో ఉండి ‘కరెంట్ పోతుంద’ని ఎలా మాట్లాడుతారని మండిపడ్డారు. ఆయన మంత్రా? లేక జోకరా? అని ఎద్దేవా చేశారు. మూర్ఖులే అలా మాట్లాడుతారన్నారు. కరెంట్ పోతే 14వ అంతస్తు నుంచి 27వ అంతస్తుకు ఎలా పోతారు? అని కోమటిరెడ్డి ప్రశ్నించారని మరి 14 అంతస్తులే కడితే… 3వ అంతస్తులో ఉన్నప్పుడు కరెంట్ పోతే 14వ అంతస్తుకు ఎలా వెళతారు? అని కేటీఆర్ ప్రశ్నించారు. అసలు మంత్రి నోటి నుంచి కరెంట్ పోతుందనే మాట ఎందుకు వస్తుందో చెప్పాలన్నారు. తాము ఉన్నప్పుడు ఇలాంటి మాటలు రాలేదన్నారు. అంటే ఈ ప్రభుత్వాన్ని ఎంత మూర్ఖులు, ఎంత సన్నాసులు, ఎంత జోకర్లు నడుపుతున్నారో తెలుస్తోందన్నారు. కరెంట్ పోతే జనరేటర్ ఉండదా? అని చురక అంటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement