Friday, June 14, 2024

Telangana – గుండెల్లో దిగిన బాణం – కొన ఊపిరితో కోయ యువ‌కుడు


భ‌ద్రాచలం, వ‌రంగ‌ల్ ఎంజీఎంకు త‌ర‌లింపు
అయినా ఫ‌లించ‌ని డాక్ట‌ర్ల వైద్యం
రోజు రోజుకూ విష‌మించిన ఆరోగ్యం
హైద‌రాబాద్ నిమ్స్‌కు త‌ర‌లింపు
ఆపరేషన్ చేసి బాణం తొల‌గించిన‌ కార్డియోథొరాసిక్ టీమ్‌
ఆదివాసి యువకుడికి పున‌ర్ జ‌న్మ ప్ర‌సాదించిన‌ డాక్ట‌ర్లు
నిమ్స్ వైద్య బృందానికి పెద్ద ఎత్తున‌ అభినంద‌న‌లు

ప్రమాద వశాత్తు ఓ ఆదివాసి యువకుడికి గుండెకు దగ్గరగా బాణం దిగింది. మూడు రోజుల పాటు విలవిలలాడాడు. అతనికి నిమ్స్ డాక్ట‌ర్లు ఆపరేషన్​ చేసి బాణం తీసి ప్రాణం పోశారు. ఛత్తీస్‌గ‌ఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఉసూర్ ప్రాంతానికి చెందిన పదిహేడేళ్ల సోదినంద గొత్తికోయ తెగకు చెందిన యువకుడు. వారం రోజుల క్రితం అడవిలో ఉన్న సమయంలో ప్రమాద వశాత్తూ శరీరంలో బాణం దిగింది. కుటుంబీకులు వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైద‌రాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్ ఎమర్జెన్సీకి తీసుకొచ్చారు. ఇక్కడ కార్డియోథొరాసిక్ విభాగాధిపతి అమరేశ్వర రావు, డాక్టర్ గోపాల్ పరీక్షించారు. గుండె, ఊపిరితిత్తుల మధ్య బాణం చొచ్చుకుపోయినట్లు గుర్తించారు.

- Advertisement -

నాలుగు గంటలు శ్రమించి..

కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న యువకుడికి నిమ్స్‌ వైద్య బృందం ఆపరేషన్ చేసింది. నాలుగు గంటల పాటు శ్రమించి శరీరం నుంచి బాణాన్ని తొలగించారు. ప్రస్తుతం ఆ యువకుడి ప్రాణాపాయం లేదని డాక్ట‌ర్లు చెప్పారు. పక్క రాష్ట్రానికి చెందిన యువకుడి పరిస్థితిని స్పెషల్ కేసుగా పరిగణించి ఉచితంగా శస్త్ర చికిత్స చేసినట్లు డాక్ట‌ర్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్డియోథొరాసిక్ వైద్య బృందాన్ని నిమ్స్‌ డైరెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement