Sunday, April 28, 2024

Telangana Elections – డేర్​ టు లివ్​! సీనియర్లతో ఢీ!

గెలుస్తామ‌నే న‌మ్మ‌కం లేకున్నా..
గెలుస్తామన్న నమ్మకం లేకపోయినా, ప్రజలు ఆదరిస్తారన్న గోరంత ఆశతో తాము సైతం అంటూ జూనియర్లు ఉత్సాహంగా ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. ఆ కోవకు చెందిన వారిని లెక్కిస్తే, కాంగ్రెస్ నుంచి 25 మంది, భాజపా నుంచి 18 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో బరిలోకి దిగారు. గెలుపోటములపై ఆలోచన వీడి రాజకీయ రంగప్రవేశంగా సంతృప్తి చెందుతూ.. ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నారు. వారిలో మెజారిటీ అభ్యర్థులు ఆర్థిక సుస్థిరత ఉన్నవారే కావడంతో ఖర్చుకు పెద్దగా వెనకాడడం లేదు. అదే సమయంలో గెలుపుకోసం పోరాటం.. భవిష్యత్తుపై ఆత్మవిశ్వాసం… కొంతమందిలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఉత్సాహంగా బ‌రిలోకి..
ఈ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ద్విగుణీకృత ఉత్సాహంతో పోటీ చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయం అనేది ఓ చదరంగంగా మారుతోంది. అయినా సరే గెలుపోటములు పట్టించుకోకుండా చాలా మంది రాజకీయాల్లో తమ భవిష్యత్ను తీర్చిదిద్దుకునేందుకు తాపత్రయపడుతున్నారు. కొద్ది రోజుల్లోనే జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో చాలా మంది తమ రాజకీయ భవిష్యత్ ఏంటో తెలుసుకోవాలన్న దృఢసంకల్పంతోనే బరిలోకి దిగినట్లు స్పష్టమవుతోంది. అయితే మునుపెన్నడూ లేనంతగా ఈసారి చాలా మంది కొత్త వాళ్లు ఎన్నికల బరిలో అడుగుపెట్టారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి 25 మంది. బీజేపీ నుంచి 18 మంది కొత్త అభ్యర్ధులు టిక్కెట్లు దక్కించుకుని ఆత్మవిశ్వాసంతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు అభ్యర్ధుల్లో చాలామంది తాము టికెట్లు ఆశిస్తున్న నియోజకవర్గాల్లో ముందే తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. పార్టీలో గతంలో పోటీ చేసిన అభ్యర్ధులు ఈ ఎన్నికల్లో టికెట్టు రాక అసంతృప్తి వ్యక్తమవుతుండగా, వారి మద్దతు పొందడానికి జూనియర్లు ప్రయత్నిస్తున్నారు.

పట్టువీడని ప్రయత్నాలు..
మరోవైపు చాలా నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు బలమైన వారు కావడంతో వారిని ఢీ కొట్టడానికి సర్వశక్తులు కూడగట్టుకుంటు న్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను ఒక్కసారి పరిశీలిస్తే.. పాలకుర్తిలో బీఆర్ఎస్ అభ్యర్ధి, మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుపై పోటీ చేస్తున్న యశస్విని(కాంగ్రెస్) తనను తాను నిరూపించుకోవడానికి నిత్యం ప్రజల్లో తిరుగుతూ శ్రమిస్తున్నారు. సర్వేల సారాంశం మేరకు గెలిచే అవకాశం లేకున్నా ఎక్కడా పట్టు వీడడం లేదు.

బీఎస్పీ నుంచి ప్ర‌వీణ్ తొలిసారి…
బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన సిర్పూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. సిర్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోనప్ప బలమైన అభ్యర్థిగా ఉండగా.. ఆయనను ఢీ కొట్టడానికి ప్రజల్లో తిరుగుతూ గెలుపొందేందుకు ప్రతికూలతలను అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సిర్పూర్లోనే ఉండటానికి నూతన గృహ ప్రవేశం కూడా చేశారు. బీఎస్సీ తరపున కేడర్ ను పెంచుకోవడంతో పాటు వారి ద్వారా ప్రచారం నిర్వహించి, ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆయన కృషి చేస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిత మొదటిసారి ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. తన తండ్రి చేసిన అభివృద్ధిని గమనించి కేసీఆర్ టికెట్టు ఇచ్చారని.. ఈ ఎన్నికల్లో గెలిచి కేసీఆర్ కు తన గెలుపును గిఫ్ట్ ఇచ్చేందుకు ఆమె తీవ్రంగా కృషిచేస్తున్నారు.

భావితరం నేతలమని ప్రకటించుకుంటూ…
కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజా గాయకుడు గద్దర్ కూతురు. వెన్నెల కంటోన్మెంట్ నుంచే తొలిసారి బరిలోకి దిగారు. రైస్ మిల్లర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన వడ్డీ మోహన్రెడ్డి బోధన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తొలిసారే తాజా, మాజీ ఎమ్మెల్యేలతో పోటీ పడుతున్నారు. ప్రచారంలో జోరు పెంచిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై స్పెషల్ ఫోకస్ పెట్టి ముందుకు సాగుతోంది. ఇప్పటికే రాజకీయాల్లో ఉండి తొలిసారిగా ఎన్నికల్లో పోటీ. చేసిన వారికి అనుభవం భవిష్యత్తులో వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement