Monday, April 29, 2024

టెట్‌ అయ్యాకే టీచర్‌ కొలువులు.. నోటిఫికేషన్‌కు ఇంకా సమయం పట్టే అవకాశం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: నిరుద్యోగులు ఎంతగానో ఆశతో ఎదురుచూస్తున్న టీచర్‌ పోస్టుల నోటిఫికేషన్‌ వెలువడేందుకు ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టెట్‌ అయ్యాకే టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ వెలువడనుంది. టెట్‌ దరఖాస్తు ప్రక్రియ ఈనెల 12 వరకు కొనసాగనుంది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ గడువును మరో వారం రోజులు పెంచే అవకాశం ఉంది. పరీక్షను జూన్‌ 12న నిర్వహించనున్నారు. ఈ ఫలితాలు వెలువడిన తర్వాత నోటిఫికేషన్‌ వేసేందుకు సుమారు రెండు మూడు నెలల వరకు సమయం తీసుకోనున్నట్లు సమాచారం. ఖాళీలు, బదిలీలు, పదోన్నతుల లెక్క ఇంకా పూర్తిగా తేలాల్సి ఉండడంతో టీఆర్టీ/డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడేందుకు ఇంకా సమయం పట్టనుంది. సీఎం కేసీఆర్‌ ప్రకటించిన 13,086 పోస్టుల్లో ఎస్‌జీటీ పోస్టులు 6,700, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 2,200 వరకు ఉన్నాయి. పండిట్‌ పోస్టులు 700 వరకు, పీడీ, పీఈటీ పోస్టులు 170, మోడల్‌ స్కూల్స్‌లో ఖాళీలు 800, గురుకులాలల్లో 90 వరకు పోస్టులు ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా డిప్యూటీ డీఈవో పోస్టులు 24 వరకు ఉన్నాయి.

అలాగే ఎస్‌సీఈఆర్టీ, లైబ్రరీ తదితర విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా 2017 జులై 23న టీఆర్‌టీ ద్వారా టీచర్‌ పోస్టులను ప్రభుత్వం నింపింది. మళ్లిప్పుడు దాదాపు 5 ఏళ్ల తర్వాత టీఆర్‌టీ/డీఎస్సీ ద్వారా టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించింది. అయితే 2015 తర్వాత నుంచి ఇంత వరకు టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వలేదు. ప్రమోషన్లు ఇవ్వాలనే డిమాండ్‌ ఉపాధ్యాయుల నుంచి వస్తోంది. ప్రభుత్వం కూడా వీరికి ప్రమోషన్లు ఇచ్చేందుకు సుముఖంగానే ఉంది. వేసవి సెలవుల్లో ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. వీరికి ప్రమోషన్లు ఇస్తే దాదాపు ఇంకా 8 వేల టీచింగ్‌ పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా ఏర్పడిన ఖాళీలను కలుపుకొని మెగా టీఆర్టీ/డీఎస్సీని వేస్తుందా? లేక 13వేల టీచర్‌ పోస్టులతోనే సరిపెట్టుకుంటుందా? అనేదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా పోస్టుల సంఖ్య, 317 బదిలీలు, ప్రమోషన్ల లెక్కనే తేలనేలేదు. ఈక్రమంలో టీచర్‌ పోస్టుల ప్రకటన వెలువడేందుకు ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉందని విద్యా వర్గాలు పేర్కొంటున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement