Sunday, May 5, 2024

Sweet Warning – ప్రతిపక్ష పార్టీని గౌరవిస్తాం – అలుసుగా తీసుకుంటే బుద్ది చెప్పుతాం – డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్ – బీఆర్ఎస్ నేతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు బట్టలు ఊడదీసి కొడతామంటే కాంగ్రెస్ కార్యకర్తలు చేతులు ముడుచుకుని కూర్చోలేదని అన్నారు. ఎల్బీ స్టేడియంలో నేడు జ‌రిగిన తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ బూత్‌ లెవెల్‌ లీడర్స్‌ సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, కాంగ్రెస్ కార్యకర్తలంతా ఒక్కసారి కన్నెర్ర జేస్తే రాష్ట్రంలో టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ మిగలదంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే.. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీని గౌరవించడం చేతగాని తనంగా భావించొద్దని చెప్పారు. తాము ప్రతిపక్షాన్ని గౌరవిస్తున్నామనీ..కానీ దాన్ని చేతగాని తనంగా భావించి నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు..

ఇక ఆరు గ్యారెంటీల్లో రెండు హామీలను అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల్లోనే అమలు చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. మతం పేరిట ఆర్థిక వ్యవస్థను విడదీసి దేశంలో విద్వేషాన్ని బీజేపీ పార్టీ రెచ్చగొడుతోందని ఆరోపించారు. ఈ క్రమంలో మతసామరస్యాన్ని కాపాడాలనే రాహుల్‌గాంధీ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర చేస్తున్నానరని అన్నారు. తన సందేశాన్ని పాదయాత్ర ద్వారా గడపగడపకు తీసుకెళ్తున్నారని అన్నారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చూపించనుందని అన్నారు. తెలంగాణ నుంచే 15 సీట్లు గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలంతా మద్దతుగా నిలవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు.

కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలంతా గౌరవంగా తలెత్తుకునే విధంగా ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన అందిస్తామని చెప్పారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా అధిగమించి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన నిలబెట్టేందుకు కృషి చేస్తామన్నారు. ఈ దేశాన్ని పాలించే అర్హత ఉన్న పార్టీ కాంగ్రెస్‌ మాత్రమే అనీ.. మరే పార్టీకి ఆ అర్హత లేదని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. దశాబ్దకాలం పాటు అనేక సమస్యలను ఎదుర్కొని గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా మూడు రంగుల జెండాను భుజాన పెట్టుకుని మోసిన కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement