Thursday, April 25, 2024

TS: బీజేపీని ఓడించేందుకే టీఆర్ఎస్‌కు మద్దతు.. ప్రజా వ్యతిరేక విధానాలపై తప్పకుండా ప్రశ్నిస్తాం: సీపీఎం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలోని అన్ని వ్యవస్థలను, రాజకీయ పార్టీలను దెబ్బతీస్తున్న భారతీయ జనతా పార్టీని ఓడించడం కోసమే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీకి మద్ధతిచ్చామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజా వ్యతిరేక విధానాలపై తాము టీఆర్ఎస్ పార్టీని సైతం ప్రశ్నిస్తామని, ప్రజాసమస్యలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఉద్దేశపూర్వకంగా ఈ ఎన్నికలను తీసుకొచ్చిన బీజేపీకి బుద్ధిచెప్పడం కోసమే తాము టీఆర్ఎస్‌కు మద్ధతు ప్రకటించామని వివరించారు. మరో 15 నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై చెబుతున్న కారణాలేవీ సహేతుకంగా లేవని రంగారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ ఏ రోజూ సహకరించలేదని, ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ప్రకటించలేదని ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొడతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నారు తప్ప, అభివృద్ధి గురించి మాట్లాడ్డంలేదని విమర్శించారు. ఫాసిస్ట్ ధోరణి అవలంబిస్తున్న బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉందని జూలకంటి రంగారెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement