Sunday, April 28, 2024

Station Ghanpur – వంద త‌ప్పులు జ‌రిగాయి..శిర‌చ్ఛేద‌మే మిగిలింది… రేవంత్ రెడ్డి

స్టేష‌న్ ఘ‌న్ పూర్ – పాపాలు పండాయ్, శిశుపాలుడి 100 తప్పులు ముగిశాయి. ఇక శిరచ్ఛేదమే తరువాయి, బీఆర్ఎస్ నేలకూలాలి, కాంగ్రెస్ గెలవాలి, అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర పదజాలంతో సీఎం కేసీఆర్పై విరుచుకుపడ్డారు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో కాంగ్రెస్ విజయభేరీ సభలో ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. అదే విధంగా మాజీ మంత్రులు కడియం శ్రీహరి, రాజన్నపై తిట్ల దండకం అందుకున్నారు. వీళ్లిద్దరంటే సొంత పార్టీ నాయకుడికే విశ్వాసం లేదన్నారు. ఇద్దరికీ ఉప ముఖ్యమంత్రి పదవులిచ్చి కేసీఆరే ఊడగొట్టారని, వీరి అక్రమాల విషయాలన్నీ కేసీఆర్కు తెలుసన్నారు. విద్యాశాఖ మంత్రిగా పని చేసిన నాయకుడు స్టేషన్ ఘన్పూర్కు ఒక్క డిగ్రీకాలేజీ తీసుకురాలేదని, ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసిన నాయకుడు 100 పడకల ఆసుప్రతి తీసుకురాలేదన్నారు.

ఎర్రబెల్లి దయాకర్ ఇక రాజకీయ ద్రోహి మిత్ర ద్రోహి అని, సొంత డబ్బులు ఖర్చు చేసి గ్రామాల అభివృద్దికి సర్పంచులు కృషి చేసి.. బిల్లులు రాలేదని బాధపడుతుంటే, ఒక సర్పంచి ఆత్మహత్య చేసుకుంటే.. ఖాళీ బీరు సీసాలు అమ్ముకుని బతకండని దయాకర్ సలహా ఇస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
గడచిన పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం తెలగాణకు ఒరగబెట్టిందేమీ లేదని, తన కొడుక్కి, అల్లుడికి మంత్రి పదవులు ఇచ్చారని, తొలి ఐదేళ్లలో మంత్రి వర్గంలో మహిళలకు స్థానం లేదని, ఇప్పుడు ఇద్దరికి స్థానం ఇచ్చానని కేసీఆర్ గొప్పలు పోతున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నలుగురు మహిళలకు మంత్రి వర్గంలో చోటు కల్పిస్తామన్నారు,.
ఆంధ్రాలో పార్టీని నష్టపోయి, తెలంగాణ ప్రజల బాగోగుల కోసం సోనియాగాంధీ తెలంగాణాను ఇస్తే… ప్రజల తెలంగాణ కాదని, దోపీదారుల తెలంగాణగా మారిందని, నమ్మినోళ్లను కేసీఆర్ మోసం చేశారని, ఇది దండుపాళెం ముఠా అని, ఈ ముఠాను పొలిమేర దాటేవరకూ తరిమి కొట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.


తెలంగాణాలో 30 లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగులుగా మారారని, ఉద్యోగం లేక, ఉపాధి లేక, తల్లి దండ్రులకు భారం కాలేక హైదరాబాద్లో అమీర్పేట, దిల్షుఖ్నగర్లో, అశోక్ నగర్లో మగ్గిపోతున్నారని, కొందరు ఆత్మహత్యలు చేసుకొంటుంటే.. వాళ్లని, తల్లిదండ్రులను, కుటుంబాలను బద్నామ్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 30 లక్షల మంది నిరుద్యోగులు అడవి బాట పట్టి, అన్నలతో కలిసి ఎన్కౌంటర్ల బారిన పడే పరిస్థితిని కేసీఆర్ కల్పించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.


ఇక ఇంటి పెత్తనం ఆడపిల్లకు ఇస్తే కుటుంబం బాగుపడుతుందని, కానీ కేసీఆర్ ప్రజలను తాగుబోతులుగా తయారు చేశారని, సాయంత్రం వరకూ కష్టపడి ఇంటికి చేరిన పెనిమిటి ఓ పావు తాగితే భార్య బాధపడదని, కానీ కన్న బిడ్డే తాగుబోతుగా మారితే ఏ ఇల్లాలు సహించలేదని, కానీ బడికి వెళ్లాల్సిన 12 ఏళ్ల పోరగాడు ఒక చేతిలో బీరు సీసా, మరో చేతిలో బీఆర్ఎస్ జెండాతో ఊరెగటం భరించగలమా? అని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ఇంతకీ తెలంగాణ దేనిలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది, రైతుల ఆత్మహత్యల్లోనా, కరువులోనా, మహిళలపై అత్యచారాల్లోనా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement