Monday, April 29, 2024

Special Story – గురిలేని బాణం… ప‌రిపక్వ‌త లేని గ‌మ్యం…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ సమాజాన్ని సరిగ్గా అంచనా వేయకుండా నే రంగంలోకి దిగి స్వర్గీయ వైఎస్‌ రాజ శేఖరరెడ్డి కుమార్తె షర్మిల దారుణంగా విఫలమయ్యారు! ఆమె అసలు గురే లేనిబాణంగా మారిపోయింది! ఎన్నో పోరాటాలతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో ఆమె క్షేత్రస్థాయి పరిస్థితు లను తెలుసుకోలేకపోయారు. సామాజి కంగా మమేకం కాలేకపోయారు. కారణాలు ఏమైనప్పటికీ ఆమె సోదరుడు, ఏపీ సీఎంతో విభేదించి తెలంగాణలో పార్టీని స్థాపించారు. కాని, తగు వ్యూహా లు, ప్రణాళికలు లేకుండానే ఆమె పాదయాత్ర మొదలు పెట్టారు. కేవలం అధికార పక్షం భారాసపైనా, ముఖ్యం గా సీఎం కేసీఆర్‌పైనే విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. మొదట్లో ఆమెకు మంచి ఆదరణ కనిపించినా రానురాను జనం దూరమయ్యారు. క్రమేణా కిందిస్థాయి నేతలు కూడా దూరమయ్యారు! ఆమె చేసిన ప్రసంగాలే ఆమెను దెబ్బతీశాయి! తన అవగాహన లేమితో, స్థిరత్వం లేని నిర్ణయాలతో షర్మిల ఏ వర్గాన్నీ సంతృప్తి పరచలేకపోయారు. పైగా పోను పోను ఏవగింపుగా మారాయన్న విమర్శలు కూడా వచ్చాయి.

ఆమె భాజపా వదిలిన బాణమని, జగనన్న వదిలిన బాణమని, కాదు..కాదు.. కాంగ్రెస్‌ వదిలిన బాణమని విమర్శలు, విశ్లేషణలు సాగాయి. తానెవరు వదిలిన బాణాన్ని కాదని ఆమె పదేపదే చెప్పుకోవాల్సి రావడంతో ప్రతిష్ట అడుగంటింది. పైగా కాంగ్రెస్‌తో విలీనమని, పొత్తు అని రకరకాలుగా సాగిన ప్రచారం ఆమెను మరింత దెబ్బతీశాయి. వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబంతో కర్నాటకకు చెందిన కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్‌లో విలీనానికి కాని, పొత్తుకు కాని తాను సిద్ధమని ఆమె రాయబారాలు నడిపారు. చివరకు హస్తిన వెళ్లి సోనియా, రాహుల్‌, ప్రియాంకలను కలిశారు. కాని, ఏమీ తేల్చలేకపోయారు. దీంతో ఆమె ఏకాకిగా మిగిలిపోయారు. సరైన హామీ లేకుండా పిలిచారు కదా అని ఆదరాబాదరాగా హస్తిన పరుగెత్తడమేమిటని, తీరా కలిసి చర్చలు ముగిసిన తర్వాత ఏమీ తేలకుండానే కాంగ్రెస్‌కు, సోనియా, రాహుల్‌లకు ఎందుకు సర్టిఫికెట్‌ ఇచ్చారని సొంత కేడరే విమర్శిస్తోంది!

ఇంత జరిగినా ఇంకా ఆమె తనతో పాటు కుటుంబ ప్రతిష్టను మరింత దిగజారుస్తున్నారన్న విమర్శలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. ఎన్నికల బరిలోకి తల్లి విజయమ్మను కూడా లాగడం అత్యధిక వైఎస్సార్‌ అభిమానులకు నచ్చలేదు. ఆమెను ఎన్నికల రొచ్చులోకి లాగడం ద్వారా ఒనగూరే లాభం కంటే కుటుంబానికి, సోదరుడు జగన్మోహన్‌రెడ్డికి మరింత నష్టం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆధాత్మిక బాటలో ఉన్న విజయమ్మను బరిలో దించి క్రైస్తవుల ఓట్లను పొందాలన్న దురాలోచన తప్ప ఇందులో ఎటువంటి రాజకీయ ప్రయోజనం లేదని వారు విమర్శిస్తున్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డికి తెలంగాణ సమాజంలో ఉన్న గౌరవాన్ని కూడా షర్మిల మంటగలిపే చర్యలను వారు నిరసిస్తున్నారు. రాజకీయాలంటే కేవలం సభలు, సమావేశాలు, పాదయాత్రలు కాదు. ఎమోషనల్‌గా ఆవేశ ప్రసంగాలు చేస్తే జనం వినే రోజులు పోయాయి… ప్రజలకు ఏం చేయగలం, ఏవిధంగా చేయగలమో చెప్పడం, ప్రత్యర్థుల కంటే ముందస్తు వ్యూహాలు పన్ని తదనుగుణంగా ప్రణాళికలతో ముందుకు సాగడమని ఆమె గుర్తించలేకపోయారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

- Advertisement -

రాజకీయాల్లో తరతమ బేధాలు ఉండవన్న సంగతి ఆమెకు ఇప్పటికి గాని తెలిసివచ్చి ఉండదు. డీకే శివకుమార్‌ ఎంత కుటుంబ సన్నిహితుడైనా తన రాజకీయ భవిష్యత్తును ఇతరులకు పణంగా పెట్టలేరు కదా! తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అభ్యంతరంతోనే వైతెపా విలీనం లేదా పొత్తు ఆగిపోయిందన్నది నగ్న సత్యం. షర్మిలతో పొత్తు పెట్టుకుంటే గత ఎన్నికల్లో చంద్రబాబు బూచి చూపి కేసీఆర్‌ ఏవిధంగా కాంగ్రెస్‌ను దెబ్బకొట్టారో తెలియజెప్పడం ద్వారా రేవంత్‌ అధిష్టానానికి కళ్లెం వేయగలిగారని విశ్లేషకులు చెబుతున్నారు. పైగా సొంత రాష్ట్రంలో రాజకీయం చేయకుండా తెలంగాణకు వచ్చి చేయడం ఏమిటని ఎదురు ప్రశ్నించడంతో అధిష్టానం వెనక్కితగ్గింది.
వాస్తవాలను తెలుసుకోకుండా రాజకీయ అపరిపక్వతతో పార్టీ స్థాపించి అధికారం కోసం పాదయాత్రలు చేసినా విఫలమవడం ఖాయమని వైతేపా అధ్యక్షురాలు షర్మిల ఉదంతం రాజకీయ చరిత్రలో ఒక పాఠంగా నిలిచిపోతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement