Tuesday, April 30, 2024

TS: మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు..

తెలంగాణ కుంభమేళా మేడారం – సారలమ్మ జాతరకు ఆదివారం నుండి వరంగల్ లో ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతుందని ఆర్టీసీ హనుమకొండ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ తెలిపారు. వరంగల్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న న్యూ బస్ షెల్టర్ నుండి ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చలువ పందిళ్ళు, త్రాగునీటి వసతి, మరుగు దొడ్ల సౌకర్యం కల్పించినట్లు డీఎం వివరించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా నాలుగు క్యూలైన్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. క్యూలైన్లకు సైతం నీడ ఉండేలా చలువ పందిళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తుల భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

ప్రయాణికులకు అందుబాటులో 430 బస్సులు..

వరంగల్ లోని బస్ షెల్టర్ నుండి 430 బస్సులను భక్తులకు అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. ఈనెల 18నుండి 25 వరకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా బస్సులను నడపడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మహిళలకు తమ ఒరిజినల్ ఆధార్, ఆయా గుర్తింపు కార్డులతో ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందన్నారు. మగవారికి టికెట్ ధర రూ. 250/- 11 సంవత్సరాల లోపు బాలురకు రూ.140/- గా నిర్ణయించినట్లు తెలిపారు. వరంగల్ లోని మేడారం తాత్కాలిక బస్ పాయింట్ నుంచి సుమారు రెండు లక్షల మంది భక్తులను మేడారంకు తరలించడానికి ఏర్పాటు చేసినట్లు డిఎం వివరించారు.

- Advertisement -


నగరంలో ఉచిత బస్సులు..
తిరుగు ప్రయాణంలో భక్తులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చడానికి హనుమకొండ, వరంగల్, కాజీపేట ప్రాంతాలకు ఉచిత బస్సులను నడపనున్నట్లు డీఎం తెలిపారు. ములుగు రోడ్డు పాయింట్ నుండి వరంగల్ రైల్వే స్టేషన్, హనుమకొండ బస్టాండు, కాజీపేట రైల్వే స్టేషన్ ల వరకు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఉచిత బస్సులను నడపడం జరుగుతుందన్నారు. పోలీస్ శాఖ, గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్, విద్యుత్ శాఖ, రైల్వే శాఖ, కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ, వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక శాఖ స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర-2024 విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని డీఎం భూక్య ధరంసింగ్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement