Monday, May 6, 2024

Railway: భద్రాచలం రోడ్‌-డోర్నకల్‌ డబుల్‌ లైన్‌కు సౌత్ సెంట్రల్ రైల్వే గ్రీన్ సిగ్న‌ల్…

భద్రాచలం రోడ్డు-డోర్నకల్ మధ్య డబుల్ లైన్ ఏర్పాటుకు దక్షిణ మధ్య రైల్వే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. రూ.770.12 కోట్లతో ఈ విభాగాన్ని విస్తరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కేంద్ర బడ్జెట్‌లో ఈ లైన్‌కు రూ.100 కోట్ల నిధులు కేటాయించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

కొన్ని నెలల క్రితం రైల్వే శాఖ ఈ ప్రాజెక్టును.. వికారాబాద్, విష్ణుపురం స్టేషన్లకు బైపాస్ లైన్లను మంజూరు చేసింది. నల్గొండ జిల్లా విష్ణుపురం రైల్వే స్టేషన్ సమీపంలోని దామరచర్లిలో ప్రస్తుతం 4 వేల మెగావాట్ల సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును సింగరేణి గనుల నుంచి తెప్పించనున్నారు. అందులో భాగంగా సింగిల్ లైన్ గా ఉన్న భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం)-డోర్నకల్, మోటమర్రి-విష్ణుపురం సెక్షన్లను విస్తరించేందుకు దక్షిణ మధ్య రైల్వే గతేడాది సర్వే పూర్తి చేసింది. ఇందులో భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం)-డోర్నకల్ రెండో లైన్ పనులకు రైల్వే మంత్రిత్వ శాఖ గతేడాది ఆమోదం తెలిపింది.

తాజా మధ్యంతర బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా వికారాబాద్‌లో 2.8 కి.మీ, విష్ణుపురంలో 4.9 కి.మీ మేర బైపాస్‌ లైన్లు నిర్మించనున్నారు. దీంతో ఆయా స్టేషన్లలోకి వెళ్లకుండా బయటి నుంచి గూడ్స్ రైళ్లు బయలుదేరుతున్నాయి. రూట్ మార్చే ప్యాసింజర్ రైళ్లకు ఇంజన్ మార్చే సమస్య ఉండదు. తద్వారా ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణించే వారికి సమయం కలిసి వస్తుంది. శంషాబాద్-విజయవాడ-విశాఖపట్నం, విజయవాడ-కర్నూలు సెమీ హైస్పీడ్ కారిడార్‌ల పెట్ సర్వే మార్చిలో పూర్తవుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ కారిడార్లలో గంటకు 220 కి.మీ వేగంతో రైళ్లు ప్రయాణిస్తాయని తెలిపారు. చర్లపల్లి టెర్మినల్ త్వరలో పూర్తికావడంతో సికింద్రాబాద్ స్టేషన్ పై ఒత్తిడి తగ్గుతుందన్నారు. దక్షిణ మధ్య రైల్వేకు కేంద్ర బడ్జెట్‌లో రూ.14,232.84 కోట్లు కేటాయించామని.. గతేడాది కేటాయించిన మొత్తం రూ.13,786.19 కోట్లకుపైగా ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement