Friday, February 23, 2024

Silence – తెలంగాణ ఎన్నికల ప్ర‌చారానికి తెర …మూగ‌నోము ప‌ట్టిన నేత‌లు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం అయిదు గంట‌ల‌కు ముగిసింది. తెలంగాణలో మూడు ప్రధాన పార్టీల తరపున ఆయా పార్టీల అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో నాలుగు గంటలకే ప్రచారం ముగిసింది.సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక,ఇల్లెందు, కొత్తగూడెం, ఆశ్వరావుపేట,భద్రాచలం నియోజకవర్గాల్లో ఇవాళ నాలుగు గంటలకే ప్రచారం ముగిసింది. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఐదు గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి పోలింగ్ జరుగుతుంది.

తెలంగాణ రాష్ట్రంలోని 96 సభల్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. కేసీఆర్ తో పాటు హరీష్ రావు, కేటీఆర్ లు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.తెలంగాణ మంత్రి కేటీఆర్ 60 రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మొత్తం 70 రోడ్‌షోల్లో పాల్గొన్నారు కేటీఆర్. రోడ్ షోలతో పాటు 30 బహిరంగ సభల్లో కేటీఆర్ పాల్గొన్నారు.వివిధ వర్గాలతో కేటీఆర్ సమావేశాలు నిర్వహించారు.పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు.150కి పైగా టెలికాన్ఫరెన్స్ లు నిర్వహించారు.

తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తరపున ఆ పార్టీల అగ్రనేతలు ప్రచారం నిర్వహించారు. నరేంద్ర మోడీ, అమిత్ షా, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్రంలోని 10 ఎన్నికల సభల్లో పాల్గొన్నారు.23 సభల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. 26 ఎన్నికల సభల్లో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు.55 సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.10 సభల్లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కాంగ్రెస్ అభ్యర్ధుల తరపున ప్రచారం నిర్వహించారు.మూడు సభల్లో కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రచారం నిర్వహించారు.రాష్ట్రంలోని నాలుగు ఎన్నికల సభల్లో ఛత్తీస్‌ఘడ్ సీఎం భూపేష్ భగేల్ ప్రచారం నిర్వహించారు.

తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేశారు. ఐదు రోజులు ఎనిమిది సభలు,ఒక్క రోడ్ షోలో ప్రధాన మంత్రి మోడీ పాల్గొన్నారు. ఎనిమిది రోజుల్లో 17 సభలు, ఏడు రోడ్ షోల్లో అమిత్ షా బీజేపీ తరపున ప్రచారం నిర్వహించారు. ఐదు రోజుల్లో ఎనిమిది సభలు, మూడు రోడ్ షోల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారం నిర్వహించారు.ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయా పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. ఆరోపణలు,ప్రత్యారోపణలు ఎన్నికల ప్రచారం సందర్భంగా చోటు చేసుకున్నాయి. ఓటర్లను తమ వైపు ఆకర్షించేందుకు పార్టీలు ప్రచారాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లాయి. ఎన్నికల ప్రచారం ముగియడంతో ఇక మాటల యుద్ధానికి తెరపడింది. ఈ రెండు రోజుల పాటు ఓటర్లను తమ వైపునకు తిప్పుకొనేందుకు పార్టీలు ప్రయత్నాలు చేయనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement