Saturday, May 4, 2024

TS: రుతుప్రేమతో దేశానికే ఆదర్శంగా సిద్ధిపేట.. హ‌రీశ్ రావు

సిద్ధిపేట ప్రతినిధి, అక్టోబర్ 5: రుతుప్రేమ కార్యక్రమంతో దేశానికే సిద్ధిపేట ఆదర్శంగా నిలవబోతున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. మహిళల ఆరోగ్య రక్షణ కోసమై, మహిళ అడుగు రుతుప్రేమ వైపునకు పేరిట శుభ్రమైన సిద్ధిపేటకే రుతుప్రేమ కార్యక్రమాన్ని చేపట్టి సిద్ధిపేట నియోజకవర్గ వర్గంలో పూర్తి చేశామని మంత్రి హరీశ్ రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట విపంచి ఆడిటోరియంలో ఇవాళ‌ ఉదయం రుతుప్రేమ యాప్ ప్రారంభోత్సవంలో హాజరై ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, పోలీసు కమిషనర్ శ్వేత, జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగ్రవాల్, మున్సిపల్ చైర్మన్ మంజుల-రాజనర్సు, జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మంత్రి మాట్లాడారు.

మానవ మనడగకు మూల కారణం రుతుచక్రం, మానవ మనుగడను శాసించేది రుతుచక్రమని, రుతుచక్రం లేకుంటే జీవన చక్రమే లేదని తెలిపారు. సంపూర్ణ స్వచ్ఛ ఆరోగ్య సిద్ధిపేటనే త‌మ లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. సామాజిక మార్పుకోసం, తనవంతు బాధ్యతగా ఏమీ ఆశించకుండా డాక్టర్ శాంతి చేస్తున్న సేవలను మంత్రి కొనియాడారు.
రూ.1.53 కోట్లు వెచ్చించి నియోజకవర్గ పరిధిలోని 53వేల మంది మహిళలకు మెన్స్ట్రువల్ కప్పులు అందించినట్లు పేర్కొన్నారు. అలాగే సెట్విన్ ఆధ్వర్యంలో 200మందికి ఉచితంగా కుట్టు మిషను శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు అందిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా ఐరన్ లోపంతో బాధపడుతున్న కౌమార బాలికలకు బలవర్థకమైన ఆహార పదార్థాలు అందజేతలో భాగంగా ఐరన్ కంటెంట్ తక్కువ ఉన్న 54 మంది విద్యార్థినీలకు 7శాతం కంటే తక్కువ ఐరన్ కంటెంట్ ఉన్నవారికి పోషకాహార కిట్స్ ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు.

ఎస్సీ గురుకుల పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు 100మందికి ల్యాప్ ట్యాప్ లు అందిస్తున్నట్లు, రాబోయే రోజుల్లో మరో 900 మందికి అందిస్తామని భరోసా ఇచ్చారు. అంతకు ముందు జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ.. 2021లో రుతుప్రేమను ప్రారంభించి సిద్ధిపేటలోని అన్నీ మున్సిపాలిటీ వార్డుల్లో, నియోజకవర్గ పరిధిలోని 91 గ్రామ పంచాయతీల్లో 1 లక్ష 33 వేల మందికి అవగాహన కల్పించామని తెలిపారు. అలాగే 53 వేల 067 మంది మహిళలకు రుతుప్రేమ మెన్స్ట్రువల్ కప్పులు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, డీపీఓ దేవకి, బీసీ కార్పోరేషన్ ఈడీ సరోజ, సెట్విన్ అమీనా, జిల్లా అధికార యంత్రాంగం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement