Wednesday, February 28, 2024

Open Letter – జెండాలు ప‌క్క‌న పెట్టండి.. గంప‌గుత్త‌గా కాంగ్రెస్ కు ఓట్లేయండి…లోకల్ బాడీ లీడ‌ర్స్ కు రేవంత్ బ‌హింరంగ లేఖ

హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్ర స్థానిక ప్రజాప్రతినిధులకు బహిరంగ లేఖ రాశారు.పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో స్థానిక ప్రజాప్రతినిధుల దుస్థితిపై లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖ‌లో ..’జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నాకు స్థానిక ప్రజాప్రతినిధుల బాధ్యత తెలుసు. ఏ ప్రభుత్వ పాలనకైనా మీరే పునాదులు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో మీ అవస్థలు.. మీకు జరిగిన అవమానాలు నాకు తెలుసు. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని కేసీఆర్ పురుగులకంటే హీనంగా చూశారు. నిర్ణయాధికారం లేక, నిధులు రాక మీరు పడిన బాధలు గుర్తున్నాయి. సర్కారు నిధులు రాకున్నా భార్య మెడలో బంగారం అమ్మి అభివృద్ధి చేసిన వాళ్లు ఉన్నారు. ఊరి కోసం అప్పుచేసి వడ్డీలు కట్టలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరికొందరు ఉపాధి హామీ కూలీలుగా, వాచ్ మెన్‌లుగా చేస్తున్నారు. బీఆర్‌ఎస్ పాలనలో ఇలాంటి దుర్ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 30న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మీ పాత్ర అత్యంత కీలకం. పార్టీలు, జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టండి. మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఇదొక అవకాశం. రేపటి నాడు మీ కష్టాలు తీర్చి, మీ గౌరవాన్ని పెంచే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. స్థానిక సంస్థలకు పూర్వవైభవాన్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది.

ఇక బీఆర్‌ఎస్‌, కేసీఆర్ పాలనకు చరమగీతం పాడుదాం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు మీ వంతు పాత్ర పోషించండి. మీ పల్లె రుణం తీర్చుకునే అవకాశం కాంగ్రెస్ ఇస్తుంది. పార్టీలకు, జెండాలకు, ఎజెండాలకు అతీతంగా.. వార్డు సభ్యుడు నుంచి సర్పంచ్ వరకు.. కౌన్సిలర్ నుంచి మున్సిపల్ చైర్మన్ వరకు.. కార్పొరేటర్ నుంచి మేయర్ల వరకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను’ అంటూ లేఖ‌ను ముగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement