Friday, May 3, 2024

వ్యాపారులదే హవా..!

  • నకిలీ విత్తనాలతో పట్టుబడుతున్న వైనం
  • ఐనా తమ వ్యాపారాన్ని ఆపని పరిస్థితి
  • కర్నూల్‌ నుండి నిర్విరామంగా నిషేధిత పత్తి విత్తనాలు
  • ఇప్పటికే రూ.2 కోట్ల విలువైన విత్తనాలు స్వాధీనం
  • సీజన్‌ ప్రారంభం కావడంతో స్పీడ్ పెంచిన వ్యాపారులు
  • నకిలీ విత్తనాలు సరఫరా చేస్తూ అడ్డంగా దొరికిపోతున్న వైనం
  • రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం
  • కొత్త వాళ్లు విత్తనాలు అమ్మితే కొనుగోలు చేయవద్దు
  • తనిఖీలు కొనసాగిస్తున్న పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులు
  • భీమవరం రంగారావుపై పీడీ యాక్ట్‌

ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి రంగారెడ్డి : వానాకాలం సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరింపజేసే ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోతున్నారు. ఐనా తమ వ్యాపారానికి బ్రేక్‌లు వేయకుండా పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులకు సవాళ్లు విసురుతున్నారు. ఒకరూట్‌లో పట్టుబడితే మరో రూట్‌లో విత్తనాలు సరఫరా చేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నకిలీ పత్తి విత్తనాలు, నిషేధిత పత్తి విత్తనాలు రైతులకు అంచగట్టేందుకు తమవంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సీజన్‌ దాటిపోయిన తరువాత పెద్దగా ప్రయోజనం ఉండకపోవడంతో ఈనెలలోనే తమవద్ద ఉన్న సరుకును విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. నకిలీ పత్తి విత్తనాలు, నిషేధిత విత్తనాలు ఎవరు విక్రయించినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు, వ్యవసాయ శాఖ ముమ్మర తనిఖీలు చేస్తూ నకిలీ వ్యాపారుల ఆటలు కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వారంలో ఏదో ఒక ప్రాంతంలో నకిలీ విత్తనాలు పట్టుబడటం మామూలైపోయింది.

రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల పరిధిలో వానాకాలంలో రికార్డు స్థాయిలో పత్తి సాగు చేస్తారు. సాధారణ సాగులో సగానికి పైగానే పత్తిపంట సాగు చేస్తారు. రెండు జిల్లాల పరిధిలో 5లక్షల ఎకరాలకు పైగానే పత్తి పంట సాగు చేస్తారు. దీంతో ఈ రెండు జిల్లాలపై నకిలీ విత్తనాలు సరఫరా చేసే వ్యాపారులు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. నకిలీ విత్తనాలు, నిషేధిత విత్తనాలు రైతులకు అంటగట్టేందుకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. నకిలీ, నిషేధిత విత్తనాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోకుండా ఎక్కడికక్కడే కట్టడి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు, వ్యవసాయ శాఖ, సీడ్‌ కంపనీల ప్రతినిధులతో టాస్క్‌ ఫోర్సు టీంలు ఏర్పాటు చేశారు.వీళ్లు క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తూ నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఐనా వ్యాపారులు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. రూట్లు మార్చుతూ అధికారులకు సవాళ్లు విసురుతున్నారు.

- Advertisement -

ఇప్పటికే రూ. 2కోట్ల నకిలీ విత్తనాలు స్వాధీనం..
ఇప్పటికే రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల పరిధిలో రూ. 2కోట్ల విలువైన నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వారంలో ఒకరోజైనా పట్టుబడుతూనే ఉన్నారు. వానాకాలం సీజన్‌ ప్రారంభమైంది. ఇంకా వర్షాలు ప్రారంభం కాలేదు. ఎండాకాలాన్ని మరిపించేలా ఎండలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. దీంతో ఇంకా పత్తి విత్తడం మొదలుకాలేదు. వర్షాల కోసం మరో వారం పదిరోజులపాటు ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు ప్రారంభం కాగానే పత్తి సాగు మొదలవుతుంది. కొన్ని ప్రాంతాల్లో తొలకరి పలకరిస్తోంది. వీటికే విత్తనాలు విత్తడం మొదలుపెడితే మొదటికే మోసం వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. వర్షాలు ప్రారంభమైన తరువాతే సాగు ప్రారంభించాలని సూచన చేస్తున్నారు. వర్షాలు ప్రారంభమయ్యే సరికి నకిలీ విత్తనాలు రైతులకు చేర్చాలనే పనిలో పడ్డారు వ్యాపారులు. దొరికిన ప్రతిసారి రూ. 40లక్షల విలువైన విత్తనాలు పట్టుపడుతున్నాయి. నకిలీ వ్యాపారుల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కర్నూల్‌ నుండి రంగారెడ్డికి..
నకిలీ విత్తనాల కేంద్రంగా మారింది కర్నూల్‌ జిల్లా. ఎక్కువ శాతం నకిలీ విత్తనాలు కర్నూల్‌ జిల్లా నుండి తరలిస్తున్న విషయం తెలిసిందే. ఈసారే కాకుండా ప్రతిసారి కర్నూల్‌ జిల్లానుండి ఎక్కువ నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తూ రంగారెడ్డి జిల్లాలో పట్టుబడటం మామూలైపోయింది. ఐనా అక్కడ కట్టడి చేయకపోవడంతో నకిలీ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది. తాజాగా షాద్‌నగర్‌లో పట్టుబడ్డ 1.5 క్వింటాళ్ల నిషేధిత పత్తి విత్తనాలు కూడా కర్నూల్‌ జిల్లానుండి తరలిస్తూ పట్టుబడ్డారు. చాలాకాలంగా కర్నూల్‌ జిల్లా నుండే నకిలీ పత్తి విత్తనాలు రవాణా చేస్తున్నారు. వీటిని రంగారెడ్డి జిల్లా గుండా వివిధ జిల్లాలకు రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. కర్నూల్‌ జిల్లానుండి వచ్చే నకిలీ విత్తనాల విషయంలో కీలక నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ప్రతి ఏటా పెద్దఎత్తున రైతులు నష్టపోయే ప్రమాదం లేకపోలేదు.

భీమవరం రంగారావుపై పీడీ యాక్టు?
నకిలీ, నిషేధిత పత్తి విత్తనాల విషయంలో పట్టుబడటం జైలుకు వెళ్లడం తిరిగి వచ్చిన తరువాత తిరిగి వ్యాపారం కొనసాగిస్తున్న భీమవరం రంగారావుపై పీడీయాక్టు ప్రయోగించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. నకిలీ విత్తనాలు, నిషేధిత విత్తనాలు సరఫరా చేసే వాళ్లు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని వారిపై పీడీయాక్టులు ప్రయోగించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినందునా పోలీసులు అప్రమత్తమయ్యారు. గతంలో కూడా పట్టుబడిన నేపథ్యంలో ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. భీమవరానికి చెందిన రంగారావు కర్నూల్‌ కేంద్రంగా నిషేధిత పత్తి విత్తనాల వ్యాపారం చేస్తున్నారు. పలుమార్లు పట్టుబడినందునా కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement