Wednesday, May 22, 2024

TS | మోదీపై కేసీఆర్ ఆగ్రహం.. ఎవ్వరికీ మేలు చేశారో చెప్పాలి..

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. కానీ బీజేపీ వైఖరి మాత్రం మోదీ లేదా ఈడీలా ఉంది. దర్యాప్తు సంస్థలను పంపిస్తామని కేంద్ర ప్రభుత్వం బెదిరిస్తోందని… ఇదేం రాజకీయం అంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మండిప‌డ్డారు. శనివారం చేవెళ్ల బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ…. తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేసుకున్నామన్నారు. బీజేపీ పాలనలో ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదని విమర్శించారు.

బీజేపీ ప‌దేండ్ల‌లో ప్ర‌జ‌ల్లో భావోద్వేగాలు పెంచ‌డం త‌ప్ప ఒక్క మంచి ప‌ని కూడా చేయ‌లేదు. తెలంగాణకు ఒక్క నవోదయ పాఠశాల రాలేదని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలేదని మండిపడ్డారు. కేంద్రంలో ఉన్న చ‌ట్టం ప్ర‌కారం ఒక రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లాల‌కు ఒక‌టి చొప్పున‌ న‌వోద‌య పాఠ‌శాలలు ఏర్పాటు చేయాలి. అలా మ‌న‌కు 23 కొత్త న‌వోద‌య పాఠ‌శాల‌లు రావాలి. ఒక్క కాలేజీ ఇవ్వని బీజేపీకి మనం ఎందుకు ఓటు వేయాలి? అని నిలదీశారు.

పెట్రోల్, డీజిల్ సంగతి అందరికీ తెలిసిందే అన్నారు. తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెట్టాలని ప్రధాని మోదీ తన మెడపై కత్తి పెట్టినా మనం తగ్గలేదన్నారు. మీట‌ర్లు రావొద్దు అంటే జీజేపీకి ఓటు వేయొద్దు.. బీజేపీని నేల‌కేసి గుద్దాలి. అప్పుడే మ‌న‌కు స‌రైన తెలివి ఉన్న‌ట్టు.. రాజ‌కీయ ప‌రిజ్ఞానం ఉన్న‌ట్టు. ద‌య‌చేసి ఆలోచించండి. మీటర్లు రావొద్దంటే బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు.

హామీలు అమలు చేయని కాంగ్రెస్ కు లోక్ సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి

చేవెళ్ల లోక్ సభ సీటు నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి పోటీ చేసిన వారు గతంలో మన పార్టీలోనే గెలిచారన్నారు. వారెవరో తెలియని సమయంలో మనం గెలిపించామన్నారు. వారు పార్టీ ఎందుకు మారారో చెప్పాలని నిలదీశారు. అధికారం, పదవి… దేని కోసం బీఆర్ఎస్‌ను వదిలి పెట్టారో చెప్పాలన్నారు. అన్ని లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలవాలన్నారు.

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నాయకులను హామీలపై నిలదీయాలని సూచించారు. నాలుగు నెలలు అయినా రైతుబీమా, రైతుబంధు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement