Tuesday, April 16, 2024

ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లు.. భారీగా మోహరించిన పోలీసులు..

రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో మైనింగ్ జోన్ ఏర్పాటు విషయమై మండల కేంద్రం పరిధిలో ఈ రోజు భారీ బందోబస్తు మధ్య అధికారులు ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాటు చేశారు. శుక్రవారం తెరాస నేతలు టెంట్లను కూల్చివేయడంతో ఈరోజు ఉదయం అధికారులు మళ్లీ టెంట్లను ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ కోసం సభను నిర్వహిస్తున్నారు. యాచారం మండల పరిధిలోని మొండి గౌరెల్లి, యాచారం గ్రామ పరిధి మధ్యలో మైనింగ్ ఏర్పాటు చేసేందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు బీజేపీ, తెరాస పార్టీ నేతలతో పాటు రైతులు, గ్రామస్తులు కూడా ఈ సభను అడ్డుకునేందుకు చూస్తున్నారు. వారిని అడ్డుకొని సమావేశం సాఫీగా సాగేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లను చేశారు. సభ సాఫీగా కొనసాగుతుందా లేక నేతలు, ప్రజలు అడ్డుకోవడంతో మధ్యలోనే ఆగిపోతుందా తెలియాల్సి ఉంది. మైనింగ్ జోన్ వద్దని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి.. లోకల్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఐనా ఏర్పాట్లు జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement