Wednesday, May 29, 2024

TS | రాగల మూడు రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలెర్ట్‌ జారీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాగల మూడు రోజులపాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు- గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అదే సమయంలో పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది.

శనివారం ఆదిలాబాద్‌, కొమరంబీం ఆసీఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూలు, నారాయణపేట జిల్లాల్లో వడగాల్పులతోపాటు అక్కడడక్కడా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 21న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఈ నెల 22న ఆదిలాబాద్‌, కొమరం భీం ఆసీఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో వర్షాలు పడుతాయని వివరించింది. ఈ నెల 23, 24 తేదీల్లోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

45డిగ్రీలకు చేరువలో పగటి ఉష్ణోగ్రతలు

తెలంగాణలో ఎండలు మండిపోతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ హెచ్చరించింది. వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పేర్కొంటూ శుక్రవారం సర్క్యులర్‌ను జారీ చేసింది. కాగా… రాష్ట్ర వ్యాప్తంగా భానుడి భగభగలకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 45డిగ్రీల చేరువగా నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో శుక్రవారం గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలను దాటి 45డిగ్రీలకు చేరువగా నమోదయ్యాయి. రాబోయే రెండు రోజుల్లో కూడా పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే రోజుల్లో గరిష్ఠంగా 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement