Friday, April 26, 2024

ఖమ్మంలో కరోనా ‘బాంబర్లు’

ఓట్ల కోసం ప్రాణాలతో చెలగాటం
పాజిటివ్‌ ఉందని తెలిసినా.. ప్రచారం చేసిన అధికార పార్టీ అభ్యర్థులు
క్యాడర్‌కు, జర్నలిస్ట్‌లకు.. ఓటర్లకు అంటించేశారు
బ్లాస్ట్‌కు సిద్ధంగా.. ఖమ్మం.. పరిస్థితి భయంకరం

ఖమ్మం నగర కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీలో ఉన్న కొందరు అభ్యర్థులు కరోనా బాంబర్లుగా మారి.. అందరికీ అంటించేశారు. ఎన్నికల్లో గెలవాలనే తాపత్రయం.. ఏం కాదులే అనే ధీమా.. ప్రచారానికి సమయం అయిపోతుందనే తొందరపాటు వెరసి తమకు కోవిడ్‌ లక్షణాలున్నా.. ఏ మాత్రం బయటపడకుండా.. అందరినీ వెంటేసుకుని తిరుగుతూ వైరస్‌ వ్యాప్తికి కారకులయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గెలుపు వెూజులో.. ఓట్ల వేటలో పడి చివరకు ప్రజల ప్రాణాల మీదకు తెచ్చారు.

ఖమ్మం, – వారు ఓట్లకోసం.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. తమ సన్నిహితుల వద్దా నిజం దాచి, వారి ప్రాణాలకూ ముప్పు తెచ్చారు. ఎవరి ప్రాపకం కోసం.. దయ కోసం పదిరోజులుగా ప్రయాసపడ్డారో.. ఆ ఓటర్లకూ నిజం చెప్పలేదు. ప్రచారం కవర్‌ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులను కూడా వదల్లేదు.. వెరసి ఖమ్మంలోని పదికి పైగా డివిజన్లలో పాజిటివ్‌ వచ్చిన కొందరు అధికార పార్టీ అభ్యర్థులు ? కరోనా బాంబర్లుగా మారి.. తమ సన్నిహితులకు, వెంట తిరిగిన క్యాడర్‌కు, జర్నలిస్టులకు, చివరకు ఓటర్లకు కూడా కరోనాను వ్యాప్తిచేశారు. దీంతో ఖమ్మంలో కరోనా విస్ఫోటనానికి పదులసంఖ్యలో కుప్పకూలి.. ఆస్పత్రులపాలవుతుండగా, కొందరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ నేతల నిర్వాకం, ఓట్లు.. పదవుల ధ్యాసే తప్ప ప్రజల ప్రాణాలు.. సన్నిహితుల ప్రాణాలపై పట్టింపులేకపోవడంతో.. ఖమ్మంలో పరిస్థితి భయంకరంగా మారింది. పాజిటివ్‌ వచ్చిన రోగులు, ఆయా లక్షణాలు సోకిన వారు.. ప్రాణాలు గుప్పిట పెట్టుకుని ఆస్పత్రుల వైపు పరుగులు తీస్తున్నారు. అభ్యర్థులు నిజం దాచి.. ప్రజల మధ్య కరోనా బాంబర్ల తరహాలో తిరిగిన ఫలితంగా వందలసంఖ్యలో పాజిటివ్‌లు ప్రతిరోజూ ఆస్పత్రుల వైపు పరుగులు తీశారు..తీస్తున్నారు. కొందరు స్థానిక ఆస్పత్రులను, మరికొందరు హైదరాబాద్‌ ఆస్పత్రుల వైపునకు ఆగమేఘాల మీద వెళ్లి చిక్సిత్సల కోసం లక్షలు ఖర్చుపెడుతున్నారు.

ఖమ్మంలో విలయమే..
గత మూడు నాలుగురోజులుగా ఖమ్మంలో కేసుల తీవ్రత విస్ఫోటనంగా పెరుగుతూ పోతుండగా, ఇంకా టెస్టింగ్‌ కొట్లకొరతతో వేలమందికి పరీక్షలు నిర్వహించడం లేదు. ఖమ్మంలో అధికారిక లెక్కల ప్రకారం 424 కేసులుండగా, ఇంతకు పదింతలు రికార్డుల కెక్కని కేసులు ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. ఈనెల 21న 134 కేసులు ఉండగా, 26న రికార్డు ప్రకారం కేసులు నాలుగింతలు పెరిగినట్లు స్పష్టమవుతోంది. మరణాల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. ఖమ్మంలో 21 మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్లు ఏర్పాటుచేసినా.. చెప్పేదొకటి చేసేదొకటి అన్నచందంగా పరిస్థితి మారింది. ఓ వైపు కరోనా పాజిటివ్‌ వచ్చి లక్షణాలు కనబడకపోవడంతో తాము టాబ్లెట్లు వేసుకుంటూనే జనం మధ్య తిరిగి.. ప్రజలకు అంటించిన పలువురు టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తీరు, వీరిని ప్రోత్సహించిన నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

సాగర్‌ సీనే..
నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో అభ్యర్థితో పాటు పలువురు నేతలకు పాజిటివ్‌ వచ్చినా ఆ విషయం దాచడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇది అంటుకుంది. సీఎంకు కరోనా రావడానికి కేవలం సాగర్‌ సభలో పాల్గొనడమే కారణమని నిర్థారించిన విషయం విదితమే. ఇపుడు ఖమ్మంలో పాజిటివ్‌ వచ్చిన సదరు పార్టీ అభ్యర్థులు జనం మధ్యే తిరగడంతో.. ఈ విస్ఫోటనం ఎలా ఉంటుందోనని స్థానికులు బెంబేలెత్తుతున్నారు. సాగర్‌లో ఎన్నికల తర్వాత వేయికి పైగా కేసులు బయటపడగా, ఖమ్మంలో అంతకంటే తీవ్రస్థాయిలో ఉంటుందని.. మరీ ముఖ్యంగా ఇతర సమస్యలు ఉన్నవారు ఆకస్మికంగా సీరియస్‌ అయి ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీ ఓట్లు, పదవుల కోసం మా ప్రాణాలతో చెలగాటమాడుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాజిటివ్‌తో ప్రచారం చేసి.. వార్డుల్లోని ప్రజలకు, జర్నలిస్టులకు, నాయకులకు అంటించిన అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు నమోదుచేయాలని పలుసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

- Advertisement -

వారి నుంచి ఏం నేర్చుకున్నారు…?
కరోనా ఎవరికీ రాకూడదని.. ముఖ్యంగా తాము ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన తనయుడు యువనాయకుడు కేటీఆర్‌, యువ ఎంపీ సంతోష్‌ తదితరులు తమకు కొద్ది పాటి కరోనా లక్షణాలు ఉన్నాయని అనుకోగానే .. ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. మరీ ముఖ్యమంగా నగరపాలక, పురపాలిక ఎన్నికల్లో కీలక పాత్ర పోసించిన మంత్రి కేటీఆర్‌ తనకు లక్షణాలు ఉన్నాయని తెలుసుకుని… మొత్తం ప్రచారానికే దూరమయ్యారు. ఖమ్మం, వరంగల్‌ నగరపాలక సంస్థల ఎన్నికల కన్నా.. ప్రజల ఆరోగ్యం ముఖ్యమని ఆయన భావించారు. ఈ కారణంగానే ఆయన ప్రచారంలోకి వెళ్లలేదు. ప్రజారోగ్యమే ప్రధానమని భావించిన ఆయన నాయకులకు రోల్‌మోడల్‌గా నిలిచారు. మరి అటువంటి నాయకులను చూసి ఇక్కడి నాయకులు ఏం నేర్చుకున్నారో అర్థం కాని పరిస్థితి. తమకు వ్యాధి (కోవిడ్‌) లక్షణాలున్నా.. అన్నీ దాచిపెట్టి.. ప్రచారంలో పాల్గొని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. వారి ద్వారా ఎందరికి సోకిందో తెలియని పరిస్థితిని కల్పించారు. ఇటువంటి చర్యలు హేయమైనవిగా పరిశీలకులు మండిపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement