Tuesday, October 8, 2024

ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తా..గవర్నర్ తమిళిసై

తెలంగాణలో తాను ఎలాంటి రాజకీయాలకు పాల్పడటం లేదని గవర్నర్ తమిళిసై అన్నారు.  గవర్నర్ హోదాలో ప్రత్యేక విమానం, ప్రత్యేక హెలికాప్టర్ సేవలను పొందే అధికారం తనకు ఉన్నప్పటికీ ఎప్పుడూ వాటిని తాను వినియోగించుకోలేదని చెప్పారు. రాజ్యాంగాన్ని సంరక్షించే బాధ్యతలను మాత్రమే తాను నిర్వర్తిస్తున్నానన్నారు. అయితే, తన విధులకు ఆటంకం కలిగేలా కొందరు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఎవరు ఎన్ని ఆటంకాలు కలిగించినా… తన పనిని తాను చేసుకుంటూ పోతానని చెప్పారు.తెలంగాణ గవర్నర్ గా మూడేళ్ల పాటు అందించిన సేవలు, అనుభవాలతో రాసిన ‘రీడిస్కవరింగ్ సెల్ఫ్ ఇన్ సెల్ఫ్ లెస్ సర్వీస్’ పుస్తకావిష్కరణ కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ పాత్రికేయుడు నక్కీరన్ గోపాల్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం తాను ఎంత దూరమైనా వెళతానని, ప్రజా శ్రేయస్సే తనకు ముఖ్యమని ఈ సందర్భంగా తమిళిసై చెప్పారు. వరదల సమయంలో తాను భద్రాచలంకు వెళ్తున్నానని తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్… హుటాహుటిన వరద ప్రభావిత ప్రాంతాలకు బయల్దేరారని తెలిపారు. వరద బీభత్సం ఉన్నప్పటికీ పట్టించుకోకుండా అప్పటి వరకు బంగ్లాలో ఉన్న కేసీఆర్… తన వల్లే బయటకు వచ్చారని చెప్పారు. సాధారణ జీవితం గడపడం తనకు ఇష్టమని… రాజ్ భవన్ లో తనకయ్యే ఖర్చును కూడా నెలనెలా తానే చెల్లిస్తున్నానని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement