Sunday, April 28, 2024

NZB: మనవడిని హత్య చేసిన నానమ్మకు జీవితఖైదు…

నిజామాబాద్, ఫిబ్రవరి 28(ప్రభ న్యూస్): మనవ‌డిని వరద కాలువలో పడవేసి హత్య చేసిన నగు వోతుల గంగవ్వకు జీవిత కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల బుధవారం తీర్పు వెలువరించారు.. వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండల కేంద్రoలోని పెద్దమ్మ కాలనీకి చెందిన గంగవ్వ కుమారుడు గంగాధర్ కు మూడున్నరేళ్ల కుమారుడు లక్కీ కలడు. గంగవ్వ చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవిస్తుంది. ఆమె భర్త చాలా రోజుల క్రితమే చనిపోయాడు. ఆమెకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. పెద్ద కొడుకు గంగాధర్ తన భార్య గంగామనిని దాంపత్య విషయంలో గొడ‌వ‌ల‌తో తలపై ఇటుకతో కొట్టి చంపినాడనే అభియోగాలతో జైలుకు వెళ్లి, బెయిలుపై తిరిగి వచ్చాడు. ఈ సమయంలో గంగాధర్ కొడుకు అయిన మూడున్నరేళ్ల లక్కీని పోషణను చూసుకునేది.

డెబ్భై ఏళ్ల ముసలి తల్లిని తానే పోషించడం భారం, కష్టం కావడం దానికి తోడు మనమడు లక్కీ బాగోగులు భారంగా మారడంతో ఆ బాలుడిని చంపివేయా లనుకుని కొడుకు గంగాధర్ లేని సమయంలో 2023 మే 10న మధ్యాహ్నం రెండు గంటలకు చిత్తు కాగితాలు ఏరుకోవడానికని మనవడిని వెంట తీసుకుని వెళ్లి కమ్మర్ పల్లి గ్రామ శివారులోని ఉప్లూర్ గ్రామానికి వెళ్లే రహదారిలో గల వరద కాలువలో మనవ‌డు లక్కీని ఎత్తి పడవేసింది. వరదకాలువలో నీటిలో బాలుడు ఊపిరాడక మరణించాడనే హత్య అభియోగాలు కోర్టు నేర న్యాయ విచారణలో నిరూపణ అయినట్లు సెషన్స్ జడ్జి సునీత తమ తీర్పులో పేర్కొన్నారు. హత్యా నేరం రుజువు అయినందున గంగవ్వకు జీవిత కారాగార శిక్ష విధిస్తూ పద్నాలుగు పేజీల తీర్పు వెలువరించారు. పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవిరాజు ప్రాసిక్యూషన్ నిర్వహించారు. పీపీకి సహాయకారులుగా కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ పోలీస్ కానిస్టేబుల్ రామారావు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement