Thursday, April 18, 2024

NZB: రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచాలి.. కలెక్టర్

నిజామాబాద్ సిటీ, డిసెంబర్ 13 (ప్రభ న్యూస్): జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఇవాళ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్ లో కలెక్టర్ వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో ఎరువుల సమీకరణ, వాటి పంపిణీ తీరుతెన్నులపై సమీక్ష జరిపారు. జిల్లాలో ఎక్కడ కూడా యూరియా కొరత నెలకొనకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సహకార సంఘాల ద్వారా రైతులకు వారు సాగు చేస్తున్న పంట విస్తీర్ణాన్ని అనుసరిస్తూ సరిపడా మోతాదులో ఎరువులు అందించాలన్నారు.

ఎరువుల కృత్రిమ కొరతను సృష్టించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎరువుల క్రయవిక్రయాల వివరాలను ఈ-పాస్ మెషిన్ ద్వారా వెంటవెంట నమోదు చేసేలా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎక్కడైనా సమస్య తలెత్తితే తన దృష్టికి తేవాలన్నారు. నకిలీ, నాసిరకం విత్తనాలు, క్రిమిసంహారక మందులు, ఎరువుల వల్ల రైతులు మోసపోకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, జిల్లా సహకార శాఖ అధికారి సింహాచలం, మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ రంజిత్ రెడ్డి, ఆయా మండలాల ఏ.ఓలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement