Thursday, May 2, 2024

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాల‌ని రైతుల రాస్తారోకో..

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని వరి ధాన్యం రైతులు ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాల‌ని, తూకం అయిన ధాన్యం ఎప్పటికప్పుడు రైస్ మిల్ కు తరలించాలని డిమాండ్ చేస్తూ మొహ్మదాబాద్, కేంరాజ్ కల్లాలి, ఖండేబల్లూర్ తదితర గ్రామాల రైతులు జాతీయ రహదారి 161పై రాస్తారోకో నిర్వహించటంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. జుక్కల్ మండలంలో సింగిల్ విండో ద్వారా మొహ్మదాబాద్, కౌలాస్, కల్లాలి, ఖండేబల్లూర్ లో వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 20 వేల కుంటల వరి ధాన్యం తూకం చేసి వారాలు గడుస్తున్నా లారీలు అందుబాటులో లేవని ధాన్యం తరలించకపోవటంతో తాము పడిగాపులు కాస్తున్నామని, ఇంకా దాదాపు 20 వేల కుంటల ధాన్యం తూకం చేసేది ఉందన్నారు. వారాల తరబడి కుటుంబ సమేతంగా ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నామని, వాతావరణంలో మార్పుల కారణంగా ఇంకా వర్షం కురిస్తే తమ పరిస్థితి ఏంట‌ని రైతులు వాపోతున్నారు. రైతుల రాస్తారోకో విషయం తెలుసుకున్న తహసీల్దార్ గణేష్, ఎస్ఐ మురళి రైతులకు సముదాయించగా రైతులు వారితో వాగ్వివాదానికి దిగారు. అక్రమ ఇసుక, అక్రమ మొరం లారీలు జుక్కల్ మీదుగా పదుల సంఖ్యలో అధికారుల ముందు తిరుగుతుంటే ఆ లారీలను వదిలేసి ఇతర ఖాళీ లారీల కోసం ప్రయత్నం చేయ‌టం లారీలు దొరక్క పోవడం ఎంతవరకు సబబు అని రైతులు ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేయ‌గా.. అధికారులు సముదాయించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో రైతులు రాస్తారోకో, ధర్నాను ముగించారు. రాస్తారోకో సందర్భంగా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement