Thursday, April 25, 2024

New Idea – చచ్చుబడ్డ 44 ప్రాజెక్టులకు జీవం – సీఎం రేవంత్‌రెడ్డి స‌రికొత్త ఎత్తుగ‌డ‌లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ లక్ష్యంగా రేవంత్‌ రెడ్డి సర్కార్‌ ముందుకు కదులుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న భారీ, మధ్యతరహాకు చెందిన 44 ప్రాజెక్టులపై నిపుణులు క్షేత్ర స్థాయి పర్యటనలు ప్రారంభించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన నీటిపారుదల శాఖ ఈఎన్సీ జనరల్‌ అనీల్‌ కుమార్‌ కడెం ప్రాజెక్టు నుంచి క్షేత్ర స్థాయి పర్యటనకు శ్రీకారం చుట్టారు. కడెం సమాంతర ప్రాజెక్టు అంశాన్ని పరిశీలించడంతో పాటు.. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రతిప్రాజెక్టుల‌ను అధ్యయనం చేసి వాటి పునరుద్ధరణకు సాధ్య అసాధ్యాలను పరిశీలిస్తున్నారు. అనేక సంవత్సరాల నుంచి పనులు నిలిచి పోయిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ, కడ్డెం సమాంతర ప్రాజెక్టులకు ఇందులో తొలి ప్రాధాన్యం లభించనుంది.

గత ప్రభుత్వంలో లక్షల కోట్లు ఖర్చు అయినా లక్ష్యం నెరవేరక అనేక సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రాజెక్టుల విస్తరణ పేరుతో అంచనా వ్యయాలు పెంచిన పరిస్థితి తెలంఆణ వ్యాప్తంగా ప్రాజెక్టుల్లో కనిపిస్తోంది. చిన్నపాటి వరదవచ్చినా ముంపున‌కు గురికావడంతో పాటు.. ప్రాజెక్టు పైనుంచి నీరు ప్రవహిస్తున్నా, గేట్లు మోరాయించినా నాటిప్రభుత్వం స్పందించక పోవడంతో కడెం ప్రాజెక్టు పరిస్థితి ఇప్పటికీ ఆందోళన కరంగానే ఉంది. దీంతో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కడెం ప్రాజెక్టు పునరుద్ధరణతో పాటు.. సమాంతర ప్రాజెక్టు నిర్మించే ప్రతిపాదనలను తెర‌పైకి తెచ్చింది.

వ‌ర‌ద‌ల‌కు క‌డెం అత‌లాకుత‌లం..

అయితే.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పునరుద్ధరణ చేపట్టనున్నట్లు ప్రకటించి అంచనావ్యయం నిర్ధేశించినా క్షేత్ర స్థాయిలో పనులు జరగలేదు. 1944లో నాటి నిజాం రాజు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ కొండలను సరిహద్దులుగా చేసి 25 వేల హెక్టార్లకు సాగునీరు అందించేందుకు గోదావరి ఉపనది కడెంపై బహుళార్థక సాధక ప్రాజెక్టు కడెంను నిర్మించారు. 18 గేట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టు 1958, 1995, 2022లో భారీ వరదలకు అతలాకుతలమైంది. రిపేర్లు జరగకపోవడంతో 2023లో వచ్చిన వరదలకు గేట్లు తెరుచుకోలేక ప్రాజెక్టు పైనుంచి నీరు ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు తల్లడిల్లాయి.

తాత్కాలిక రిపేర్లతో స‌రి..

- Advertisement -

ఈ నేపథ్యంలో తాత్కాలిక చర్యలు చేపట్టిన నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొత్తగేట్లు బిగించేందుకు నిధులు కేటాయించినా పనులు పూర్తి కాలేదు. అయితే.. నీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో సమాంతరంగా మరో ప్రాజెక్టును నిర్మించాలని ప్రతిపాదిస్తూ ఇచ్చిన మంజూరు అంచనా వ్యయం పెరిగి ₹1323. 65 కోట్లకు చేరుకుంది. అయినా.. ఈ సమాంతర ప్రాజెక్టుకు తట్టెడు మట్టి ఎత్తిపోయలేదు. ఈ నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఇంజనీరింగ్‌ డిజైన్లను పరిశీలించి సీడబ్ల్యూసీకి పంపించగా సూత్రప్రాయంగా ఆమోదం లభించింది. దీంతో కడెం ప్రాజెక్టుకు సమాంతరంగా ప్రాజెక్టు నిర్మించే అంశాలను డిజైన్లను, భూసేకరణ, కడెం ప్రాజెక్టు పునరుద్ధరణ కోసం క్షేత్ర స్థాయిలో నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్‌ బృందాలు ఈఎన్సీ అనీల్‌ కుమార్‌ నేతృత్వంలో పరిశీలించాయి.

సమాంతర బహుళార్ధక ప్రాజెక్టు..

కడెం ప్రాజెక్టు డ్యామ్​ ఎగువన 51 కిలో మీటర్ల ప్రాంతంలో కుప్తి దగ్గర కడెంకు సమాంతరంగా బహుళార్ధక సాధక ప్రాజెక్టు నిర్మించేందుకు అధికార బృందం క్షేత్ర స్థాయి పరిశీలన చేసింది. ఆదిలాబాద్‌ జిల్లా నేరేడుకొండ ప్రాంతంలో స్థల పరిశీలన చేసి ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. 5.36 టీఎంసీల సామర్థ్యంతో నేరేడికొండ ప్రాంతంలో కుప్తి దగ్గర ప్రాజెక్టును నిర్మిస్తే కడెం రిజర్వాయర్‌ ప్రవాహాలు క్రమబద్ధీకరణ చేయవచ్చనే నిపుణుల సలహాలను పరిగణలోకి తీసుకుని ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. కాగా, పరిపాలనా పరమైన అనుమతులు తీసుకుని త్వరితగతిన భూసేకరణ చేయనున్నట్లు సంబంధింత అధికారులు తెలిపారు. అలాగే.. కడెం ప్రాజెక్టు గేట్లను ఆధునీకరించేందుకు యుద్ధప్రాతిపాదికన పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కడెంకు సమాంతరంగా ప్రాజెక్టును నిర్మిస్తే ప్రవాహాల క్రమబద్ధీకరణతో పాటుగా 30 నుంచి 40 వేల ఎకరాల భూమి అదనంగా సాగులోకి రానుందని ఇంజనీరింగ్‌ నిపుణులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement