Sunday, April 28, 2024

New Chamber – కేసీఆర్‌ చాంబర్‌ మార్చేసిన ప్ర‌భుత్వం …భ‌గ్గుమ‌న్న బిఆర్ఎస్ నేత‌లు

హైద‌రాబాద్ – బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌ సర్కార్‌ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంద‌ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ చాంబర్‌ను కాంగ్రెస్‌ సర్కార్ మార్చేయ‌డ‌మే దీనికి నిద‌ర్శ‌నం అంటున్నారు. ఏళ్ల తరబడి ప్రతిపక్ష నేతకు ఇస్తున్న కార్యాలయాన్ని కాకుండా చిన్న రూమ్‌ను కేటాయించ‌డంపై మండిప‌డుతున్నారు. మొదటి అసెంబ్లీ సమావేశాల్లో కేటాయించిన చాంబర్‌ను రెండో సమావేశాల్లోపే ఎందుకు మార్చార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇన్నర్‌ లాబీలో ఉన్న ప్రతిపక్ష నేత కార్యాలయాన్ని ఇప్పుడు ఔటర్‌ లాబీలోని చిన్న గదిలోకి మార్చ‌డంపై నిర‌స‌న తెలుపుతున్నారు. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ చాంబర్‌ను మార్చారంటూ అసెంబ్లీ లాబీలో చర్చ జరుగుతోంది.

బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల అభ్యంత‌రం

39 మంది ఎమ్మెల్యేలున్న ప్రతిపక్ష నేతకు చిన్న గది కేటాయించడంపై బీఆర్‌ఎస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదే విషయంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను కలిసి తమ అభ్యంతరాలను తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంద‌ని ఆరోపించారు. గతంలో ఉన్న ప్రతిపక్ష కార్యాలయం కంటే ఇప్పుడు ఇచ్చినది చాలా చిన్నదిగా ఉంద‌న్నారు. ప్రతిపక్ష నేతను అవమానించేలా ప్రభుత్వ చర్య ఉందని విమర్శించారు. దీనిపై స్పీకర్‌కు విన్న‌వించిన‌ట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement