Monday, April 29, 2024

TS: ఈనెల 20న మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాసం

తిరుమలగిరి, మార్చి 5 (ప్రభ న్యూస్) : ఈనెల 20న తిరుమలగిరి మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ లపై అవిశ్వాసం మున్సిపల్ కార్యాలయంలో సూర్యాపేట ఆర్డీవో సమక్షంలో నిర్వహించడం జరుగుతుందని, దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఆదేశాల మేరకు కౌన్సిలర్లకు మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి నోటీసులు జారీ చేశారు. ఉదయం 11 గంటలకు తొలుత మున్సిపల్ చైర్ పర్సన్ పై, మధ్యాహ్నం రెండు గంటలకు వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాసం కోసం తగిన ఏర్పాటు చేయాలని కమిషనర్ కు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

మున్సిపాలిటీలో 15 వార్డులు…

2020 జనవరి నెలలో మున్సిపల్ ఎన్నికలు తొలిసారిగా జరిగినాయి. 15 వార్డులకు జరిగిన ఎన్నికలలో 11వార్డులు బీఆర్ ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నలుగురు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండోవార్డు కౌన్సిలర్ బీజేపీ పార్టీలో చేరారు.

- Advertisement -

బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరికలు….

ఇటీవల జరిగిన సారత్రిక అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఆరుగురు కౌన్సిలర్లు ఉన్నారు.

చీలిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు…

మెజార్టీ కలిగిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లలో చీలిక ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన కౌన్సిలర్ల మద్దతుతో అవిశ్వాసానికి తెర లేపారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఎస్సీ రిజర్వుడ్ కావడం, గెలిచిన ముగ్గురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు కావడంతో, చైర్ పర్సన్ పై వ్యతిరేకతతో అవిశ్వాసం పెడుతున్నట్లు కౌన్సిలర్లు చెప్తున్నారు.

ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల మద్దతు…

బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో ఇద్దరి కౌన్సిలర్ల మద్దతు కూడగట్టుకొని పదిమంది కౌన్సిలర్లతో కలిసి జిల్లా కలెక్టర్ కు అవిశ్వాసం కోరుతూ వినతిపత్రం సమర్పించిన విషయం విధితమే. అవిశ్వాసం పెట్టేది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లే.

బీజేపీ పార్టీ కౌన్సిలర్ మద్దతు…
అవిశ్వాసానికి బిజెపి పార్టీకి చెందిన రెండో వార్డ్ కౌన్సిలర్ మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తుంది.దీంతో అవిశ్వాసానికి కావలసిన సంపూర్ణ మెజార్టీ ఉందని అవిశ్వాసం నెగ్గుతుందని కౌన్సిలర్లు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ల చీలికతో అవిశ్వాసం నెగటానికి విశ్వాసం ఏర్పడింది.

కౌన్సిలర్లు క్యాంపులో…

జిల్లా కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేసి గత నెల 26న జిల్లా కలెక్టర్ కు అందజేసిన అనంతరం కౌన్సిలర్లు క్యాంపుకు వెళ్లినట్లు, ఈనెల 20న జరిగే అవిశ్వాసానికి నేరుగా హాజరవుతారని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement