Thursday, May 2, 2024

హుజూర్‌నగర్‌-కోదాడకు కొత్త రైల్వే లైన్‌.. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: డోర్నకల్‌- మిర్యాలగూడ మధ్య కోదాడ, హుజూర్‌నగర్‌లను రైల్వేలతో అనుసంధానించే కొత్త రైలు మార్గం మంజూరు చేయడం అభినందనీయమని కాంగ్రెస్​ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కోదాడ, హుజూర్‌నగర్‌ ప్రాంతాలకు కొత్త రైల్వే లైన్‌ కావాలని సంబంధిత అధికారులను కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. కోదాడ, హుజూర్‌నగర్‌ మీదుగా డోర్నకల్‌- మిర్యాలగూడ మధ్య 93.10 కిలోమీటర్ల మేర కొత్త సింగిల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ లైన్‌కు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని ఆయన వివరించారు.

ఈ ప్రాజెక్టుకు 2013- 14లోనే అనుమతి లభించిందన్నారు. ప్రాజెక్టు వ్యయం రూ. 1294.12 కోట్లు అని, ఇది రాబోయే నాలుగేళ్లలో గ్రౌండింగ్‌ అయ్యే అవకాశం ఉందని ఉత్తమ్‌ వివరించారు. కొత్త రైల్వే లైన్‌ 11 స్టేషన్లను కలుపుతుందని, వాటిలో పాపట్‌పల్లి, గొల్లపాడు, గుర్రాల పాడు, గువ్వలగిడెం, నేలకొండపల్లి, రామచంద్రాపురం, కోదాడ, హుజూర్‌నగర్‌, ఎర్రగుట్ట వర్దాపురం, జాన్‌పహాడ్‌లు ఉన్నాయని ఆయన వివరించారు. ఈ కొత్త రైల్వే లైన్‌తో ఉమ్మడి నల్లగొండ జిల్లాకే కాకుండా ఖమ్మం జిల్లాకు కూడా ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వాణిజ్యపరమైన కార్యకలాపాలు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. మునుగోడులో కాంగ్రెస్‌ పార్టీనే విజయం సాధిస్తుందని, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యవహారంపై అధిష్టానం పెద్దలే స్పందిస్తారని ఆయన పేర్కొన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తాను మాట్లాడనని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement