Monday, April 29, 2024

TS : రేపు హైద‌రాబాద్‌లో మోదీ రోడ్‌షో…పలు ఆంక్షలు…

ప్రధాని మోడీ రేపు హైదరాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న 5కిలోమీట‌ర్ల మేర రోడ్‌షో నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేరకు మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో ఆయన ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు.

- Advertisement -

ఈ నెల 15న మల్కాజ్‌గిరిలో జరగనున్న సభలో మోదీ పాల్గొననున్నారు. దీంతో మీర్జాల్‌గూడ నుంచి మల్కాజ్‌గిరి క్రాస్‌ రోడ్‌ వరకు 5 కి.మీ. మేర పారా లైడర్లు, రిమోట్‌ కంట్రోల్‌ డ్రోన్లు, రిమోట్‌ కంట్రోల్‌ మైక్రోలైట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఎగరవేయడానికి అనుమతి లేదని రాచకొండ పోలీసు కమిషనర్‌ తరుణ్‌ జోషి ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఐపీసీ సెక్షన్‌ 188, 121, 121 (ఏ), 287, 336, 337, 338 కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కాగా దేశంలో అతిపెద్ద లోక్‌సభ స్థానంపై బీజేపీ ఇప్పటికే కన్నేసింది. ఆ స్థానంలో ఎలాగైన విజయం సాధించి రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ ఎంపీ స్థానాలను కైవసం చేసుకునేందుకు అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. ప్రధానంగా సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి, చేవెళ్ల, హైదరాబాద్‌ స్థానాలపై ఫోకస్‌ పెట్టిన కమలం పార్టీ ప్రచారంలో దూసుకెళ్తోంది. కాగా, రెండు రోజుల క్రితం హోం మంత్రి అమిత్‌షా నగరంలో పర్యటించారు. కేవలం పది రోజుల వ్యవధిలోనే ప్రధాని రెండోసారి తెలంగాణకు రానుండటం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నగర ఓటర్లను ఆకట్టుకునేందుకు రోడ్‌షోలు నిర్వహిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement