Friday, May 17, 2024

TS | వ్యక్తిగత కక్షలకు తెలంగాణలో తావు లేదు.. భావోద్వేగంతో స్పందించిన ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ ప్రజలకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఆడబిడ్డనైన నన్ను ఈ రోజు అరవింద్ అనే మాటలు మీ ఆడపిల్లలను అంటే మీకు సమ్మతమేనా ?.. నేను రాజకీయాల్లో ఉన్న కాబట్టి, సీఎం కేసీఆర్ బిడ్డను కాబట్టి నన్ను ఏది అన్నా ఒప్పుకుందామా? తెలంగాణలో ఇలాంటి రాజకీయాలను అనుమతిద్దామా ? అని ఎమ్మెల్సీ క‌విత‌ తీవ్ర భావోద్వేగంతో ప్రజలను అడిగారు. నిజామాబాదులో తాను ఓడిపోయిన తర్వాత చాలా హుందాగా రాజకీయాల్లో ఉంటున్నాన‌ని, గెలిచిన వారికి పనిచేసే అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో మౌనంగా ఉంటూ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్లానని గుర్తు చేశారు.

కానీ తనపై ఎంపీగా గెలిచిన వ్యక్తి.. బాధ్యతను విస్మరించి ఇష్టం వచ్చినట్లు తనపై వ్యక్తిగతంగా అనేక సార్లు మాట్లాడారని అన్నారు. ప్రజాజీవితంలో ఉన్న తాను ప్రజలకోసం ఏమైనా పనులు చేయకపోతే ప్రశ్నిస్తే సరేనని, కానీ నువ్వు చచ్చిపోతే 20 లక్షలు ఇస్తా… మీ అన్న చచ్చిపోతే పది లక్షలు ఇస్తా… మీ నాన్న.. ఇట్లా అంటూ అది, ఇది అని అరవింద్ మాట్లాడడం, ఇటువంటి భాషను ప్రయోగించడమే కాకుండా వ్యక్తిగతంగా దూషించడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ఆలోచించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.

అంశాల వారీగా ఏది ప్రశ్నించిన సమాధానం చెప్పే ధైర్యం తనకు ఉందని క‌విత అన్నారు. తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు కూడా ఆంధ్ర పాలకులపై మనం ఇలాంటి అమర్యాదకరమైన మాటలు మాట్లాడలేదని, అప్పుడు కూడా అంశాల వారిగానే వారిని ప్రశ్నించామని అన్నారు. అలాంటి మర్యాదకరమైన రాజకీయాలు ఇప్పుడు కూడా జరగాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని స్ప‌ష్టం చేశారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి అసభ్యకరంగా వ్యవహరించే రాజకీయాలను ప్రోత్సహించవద్దని తెలంగాణ ప్రజలను కోరారు. కక్షలకు తెలంగాణలో తావులేదని క‌విత‌ అన్నారు. మరీ ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చే ఆడబిడ్డలకు ఏం సందేశం ఇస్తున్నట్లుని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement