Wednesday, March 27, 2024

జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలో సిద్దిపేట మహిళకు బంగారు పతకం

దుబ్బాక, (ప్రభన్యూస్‌): జాతీయ స్థాయి ఆర్చరీ (విలువిద్య) పోటీల్లో సిద్దిపేటకు చెందిన మహిళ బంగారు పతకాన్ని సాధించారు. కేరళ రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి 27 వరకు నిర్వహిస్తున్న మాస్టర్‌ గేమ్స్‌ పోటీల్లో ఆర్చరీ విభాగంలో నాగజ్యోతి మొదటి స్థానంలో నిలిచి, బంగారు పతకాన్ని సాధించారు. మాస్టర్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా వారు ప్రతి సంవత్సరం ఒక్కో రాష్ట్రంలో వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రంలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 40 సంవత్సరాలు పైబడిన వారికి నిర్వహించిన విలువిద్య విభాగం (ఆర్చరీలో) నాగ జ్యోతి బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. ఈ మేరకు నిర్వాహకులు నాగజ్యోతికి బంగారు పతకాన్ని బహుకరించారు. వచ్చే ఆగస్టులో జపాన్‌లో నిర్వహించే ఇంటర్‌నేషనల్‌ ఆర్చరీ పోటీల్లో కూడా పాల్గొనే అవకాశాన్ని ఆమె సాధించింది.

కాగా శనివారం నాడు త్రివేండ్రం నుంచి తిరుగు ప్రయాణంలో ఉన్న నాగజ్యోతి మాట్లాడుతూ తమ పిల్లలకు కరీంనగర్‌లోనూ, హైదరాబాద్‌లోనూ ఆర్చరీ విద్యపై ఆసక్తి ఉన్నందున వారికి ఈ రంగంలో శిక్షణ ఇప్పించామన్నారు. వారిని శిక్షణకు తీసుకెళ్ళిన సమయంలో తాను, తన భర్త కూడా విలువిద్యను నేర్చుకున్నామన్నారు. ఇంతకు ముందు కూడా తాను వివిధ స్థాయిల్లో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరచడంతో తనకు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కిందన్నారు. తనకు శిక్షణనిచ్చిన కోచ్‌కు ప్రోత్సహించిన తన భర్త, కుటుంబీకులకు, శుభాకాంక్షలు తెలిపిన ఆత్మీయులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్ల నాగజ్యోతి పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement