Sunday, March 24, 2024

మే నెలాఖరులోగా మన ఊరు-మన బడి పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ రాజర్షి షా

మెదక్ ప్రతినిధి, ప్రభ న్యూస్ : మనఊరు – మనబడి కింద 30 లక్షల లోపు చేపట్టిన పనులను మే నెలాఖరునాటికి పూర్తి చేసేలా అంకిత భావంతో పని చేయాలని, అదే విధంగా 30 లక్షల పైబడి చేపట్టిన పనులను కూడా పరుగులు పెట్టించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ తో కలిసి మండల వారీగా పాఠశాలల్లో వివిధ కాంపోనెంట్ ల క్రింద చేపట్టిన నిర్మాణ పనుల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిధుల కొరత లేదని,చేసిన పనులకు సంబంధించి వెంటనే ఏం.బి.రికార్డు చేసి, ఎఫ్.టి.ఓ. పోర్టల్ లో నమోదు చేసి డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని కాంట్రాక్టర్లకు అవగాహన , ధైర్యం, భరోసా కల్పించి వర్షాకాలం నాటికి పనులు పూర్తయ్యేలా కార్యాచరణతో ముందుకు సాగాలని అన్నారు. 30 లక్షల నుండి కోటి రూపాయల లోపు పనులకు టెండర్లు రాని ప్రాంతాలలో పాఠశాల నిర్వహణ కమిటీ లో తీర్మానం చేసి నామినేషన్ పద్ధతిన వెంటనే పనులు చేపట్టాలన్నారు.

కోటి రూపాయల పైగా పనులుండి టెండర్లు రాని వాటికి సంబంధిత శాసనసభ్యుల సహకారంతో కాంట్రాక్టర్లు పాల్గొని పనులు చేపట్టేలా చూడాలని అన్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం ఇంజనీరింగ్ అధికారులు, ఎస్.ఏం.సి. చైర్మన్లు, ప్రధానోపాధ్యాయులు, మండల నోడల్ అధికారులు, ఎంపిడిఓలు, ఎంపిఓలు ,కాంట్రాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి చేపట్టవలసిన పనులు, వాటి అంచనా, కాలవ్యవధి వంటి వివరాలు తెలిపి పనులు శరవేగంతో పూర్తయ్యేలా చూడాలన్నారు. ఎస్.ఏం.సి. సర్పంచులు ముందుకు రాని పక్షంలో తమ వద్ద ఉన్నకాంట్రాక్టర్ల ద్వారా వెంటనే పనులు మొదలు పెట్టాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అదనపు తరగతి గదులు మంజూరు అయిన దగ్గర వెంటనే పనులు ప్రారంభించాలని అన్నారు. సాంకేతిక అనుమతులు లేని వాటికి వెంటనే మంజూరి ఇవ్వాలని అన్నారు. నిర్మాణాలు పూర్తై రంగులు వేసిన వాటికి ఏం.బి. రికార్డు చేయాలని, ఇటీవల పూర్తైన నిర్మాణాలు జాబితాను పెయింటింగ్ ఏజెన్సీ కి అందజేసి ఒప్పందం ప్రకారం పెయింటింగ్ వేయించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో అలసత్వం ప్రదర్శించిన పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement