Thursday, April 25, 2024

జంతు సంక్షేమానికి పాటుపడాలి : సంగారెడ్డి కలెక్టర్ శరత్

సంగారెడ్డి : జంతు సంక్షేమానికి ప్ర‌తి ఒక్క‌రూ పాటుప‌డాల‌ని సంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ శ‌ర‌త్ అన్నారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జంతు సంక్షేమం పై పశు సంవర్ధక శాఖ ముద్రించిన కరపత్రాన్ని అదనపు కలెక్టర్ రాజార్షి షా తో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జంతువుల పట్ల కరుణ చూపాలన్నారు. జంతు సంక్షేమం కోసం ప్రభుత్వం జంతు హింస నివారణ చట్టం తీసుకొచ్చిందని, ఆ చట్టాన్ని ప్రతి ఒక్కరు విధిగా పాటించాలన్నారు. మానవుల అవసరాలకు అనుగుణంగా అడవులు నరకడం, కొండలు, నదులు, సరస్సులు ఆక్రమించుకోవడం వల్ల జంతుజాలం అంతరించడంతో ప్రకృతి సమతుల్యత కోల్పోయి పలు వైపరీత్యాలకు దారితీస్తుందని తెలిపారు. మానవ తప్పిదాలతో జంతుజాలం తమ ఉనికిని కోల్పోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం జంతు రక్షణకు వన్యప్రాణి సంరక్షణ చట్టం, జంతు హింస నివారణ చట్టాలను చేస్తూ జంతు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసిందన్నారు. ఈ చట్టం మేరకు జంతువులను, పక్షులను, నీటిలో జీవించే జలచరాలను హింసించి, హాని కలిగించినట్లైతే శిక్షార్హులు అవుతారని తెలిపారు. వీధుల్లో తిరిగే జంతువుల పట్ల కరున చూపించాలని, హింసకు గురి చేయరాదని, పక్షులు నివసించే చెట్లను నరకవద్దని, పశువులు జంతువులు, పక్షులను రవాణా చేయునప్పుడు తప్పనిసరిగా జంతు రవాణా నిబంధనలను పాటించాలన్నారు. పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా రోగనిరోధక టీకాలు వేయించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement