Friday, April 26, 2024

అట్టహాసంగా ఆటోవాల ఆటల పోటీలు

మనం ఏ పని చేసి బతుకుతున్నామనే దానికంటే.. ఆ పనిలో ఎంత ఆత్మ గౌరవంగా జీవిస్తున్నమన్నదే ముఖ్యమని సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంత్రి హరీష్ రావు కృషితో నిర్వహిస్తున్న సిద్దిపేట ఆటో క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ నిర్వహణ తీరు అభినందనీయన్నారు. ఆటో కార్మికులకు క్రీడా పోటీల నిర్వహణ వల్ల మానసికోల్లాసం పెంపొందుతుందని తెలిపారు. సిద్దిపేట ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో సిద్దిపేట మినీ స్టేడియంలో జరుగుతున్న క్రీడా పోటీల్లో భాగంగా నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నీని సొసైటీ గౌరవ అధ్యక్షుడు పాల సాయిరాంతో కలిసి అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులతో ఆయన కాసేపు వాలీబాల్ ఆడి ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అనునిత్యం పనిలో నిమగ్నమై ఉండే కార్మికులకు ఇలాంటి క్రీడలు ఆటవిడుపు కలిగిస్తాయన్నారు. ఆటో కార్మికుల్లో కూడా అన్ని రకాల క్రీడాకారులు ఉండడం గొప్ప విషయమన్నారు. ఆటో కార్మికులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు మంత్రి హరీష్ రావు చేయూతతో ఏర్పడిన సొసైటీ ఇలాంటి కార్యక్రమాలతో దిగ్విజయంగా కొనసాగాలని ఆకాంక్షించారు. కార్మికులందరూ క్రీడా స్ఫూర్తితో కొనసాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు పాల సాయి రాం, సెక్రెటరీ లక్ష్మారెడ్డి , నాయకులు బుచ్చిరెడ్డి అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement