Monday, October 28, 2024

MBNR: కౌన్సిల‌ర్ భ‌ర్త‌పై దాడి చేసిన వారిపై కేసు న‌మోదు చేయాలి…

ఎస్పీ, డీజీపీలు సుమోటోగా కేసు నమోదు చేయాలి
ఆర్ఎస్.ప్ర‌వీణ్ కుమార్, గువ్వ‌ల బాల‌రాజు
అచ్చంపేట, మే 15 (ప్రభ న్యూస్‌) : బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ భర్త సుంకరి బాలరాజు, మరికొంత మంది కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మారణాయుధాలతో దాడిచేసి గాయపరచిన‌ వారిని అదుపులోకి తీసుకోకపోవడం చాలా దుర్మార్గమని, వారిపై ఎస్పీ, డీజీపీలు సుమోటోగా కేసు న‌మోదు చేయాల‌ని మాజీ ఎమ్మేల్యే డాక్టర్‌ గువ్వల బాలరాజు, పార్లమెంట్‌ అభ్యర్థి డాక్టర్‌ ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్ డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయ‌కుండా పైగా దాడి ఘటనపై ఫిర్యాదు చేసిన వారిపైనే పోలీసులు కేసు పెట్టడం లాంటి చర్యలను ప్రజలంతా గర్విస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బుధ‌వారం అచ్చంపేటలో కాంగ్రెస్ పార్టీ వారి దాడిలో గాయపడిన సుంకరి బాలరాజును గువ్వల బాలరాజు, ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ స్వగృహములో కలిసి మనోధైర్యాన్ని కల్పించారు.

ఈ సందర్భంగా వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ… మంగళవారం పట్టపగలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్‌ఎస్‌ పార్టీ మహిళా కౌన్సిలర్‌ ఇంటిపై దాడి చేసి ఆమె భర్త సుంకరి బాలరాజును, అతని తమ్ములను తదితరులను విచక్షణా రహితంగా రాళ్ళతో, దుడ్డు కర్రలతో దాడి చేసి కొట్టి, ఇంటిలోని తలపులను, ఫర్నీఛర్‌ను ధ్వంసం చేసి దాదాపు 24 గంటలు గడుస్తున్నా దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకోలేదని పైగా బీఆర్‌ఎస్‌ పార్టీ వారిపై కేసులు పెట్టడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. దాడి చేసిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోకపోతే కోర్టుతో పాటు రాష్ట్ర, జాతీయ మానవహక్కుల కమీషన్‌ను ఆశ్రయించుతామని హెచ్చరించారు.

డీజీపీ, ఎస్పీ ఈ విషయంలో వెంటనే స్పందించి సుమోటోగా కేసులు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలని, లేకుంటే ఏ త్యాగానికైనా వెనుకాడ‌మని కార్యకర్తలను, వారి కుటుంబాలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాధితులు సుంకరి బాలరాజు, మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎడ్ల నర్సింహ్మ గౌడ్‌, కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్‌ నాయకులు, రజక సేవా సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement