Monday, May 6, 2024

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. వివరాలివే

వచ్చే మార్చి 1వ తేదీ నుండి 11 వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 11 రోజులపాటు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ప్రకటించారు. బుధవారం సాయంకాలం కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు ఆధ్వర్యంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పరిపాలనా భవనములోని సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావేశంలో అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, వైదిక సిబ్బంది పాల్గొన్నారు. సీఐ ప్రసాదరావు, ఎస్సై లక్ష్మణరావు సమావేశంలో పాల్గొన్నారు.

ముఖ్యంగా ఈ సమావేశంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వాహనాల పార్కింగ్, మంచినీటిసరఫరా, క్యూలైన్ల నిర్వహణ, ఆరుబయలు ప్రదేశాలలో విద్యుద్దీకరణ, తాత్కాలిక శౌచాలయాల ఏర్పాట్లు, పాతాళగంగలో ఏర్పాట్లు మొదలైన అంశాల గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ జిల్లాయంత్రాంగం పూర్తి సహాయ సహకారాలతో బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలన్నారు. ఉత్సవాలలో సమయపాలనను తప్పనిసరిగా పాటించాలన్నారు. అన్ని వైదిక కార్యక్రమాలు కూడా నిర్ణయించుకున్న సమయానికే ఖచ్చితంగా ప్రారంభమయ్యేవిధంగా వైదిక సిబ్బంది జాగ్రత్తగా వహించాలన్నారు.

- Advertisement -

ముఖ్యంగా పోలీస్ శాఖ సమన్వయంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు చేపట్టాలని భద్రతా విభాగాన్ని ఆదేశించారు. పోలీస్ శాఖ సూచనల మేరకు ఉత్సవాలలో ట్రాఫిక్ సమస్యలు అధిగమించేందుకు రికవరి వ్యాన్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గత సంవత్సరం కంటే అదనంగా మరో రెండు రికవరివ్యాన్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పాతాళగంగలో నీటిమట్టం తగ్గుతున్న కారణంగా ఎప్పటికప్పుడు పుణ్యస్నానాల ఏర్పాటుకు తగు చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానంగా పాతాళగంగ స్నానఘట్టాల ఎగువభాగంలో జల్లు స్నానానికి ఏర్పాటు చేయాలన్నారు. పాతాళగంగలో శౌచాలయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. పాతాళగంగ స్నాన ఘట్టాల వద్ద పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గత సంవత్సరం కంటే కూడా అదనంగా మరిన్ని తాత్కాలిక శౌచాలయాలను ఏర్పాటు చేయాలన్నారు.

కనీసం 200 నుంచి 300 దాకా అదనపు శౌచాలయాల ఏర్పాటు ఉండాలన్నారు. ఉత్సవాలలో అన్ని క్యూలైన్ల వద్ద, అడ్డుకౌంటర్ల వద్ద మరియు అవసరమైన ఇతర ప్రదేశాలలో దృఢమైన బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలన్నారు. క్యూలైన్ల నిడివిని గత సంవత్సరం కంటే కూడా వీలైనంత మేరకు పెంపుదల చేయాలనీ సూచించారు. అన్ని ప్రదేశాలలో కూడా ఎలక్ట్రికల్ వైరింగును విధిగా పరిశీలించాలని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. అవసరమైతే వైరింగుకు తగు మరమ్మతులు చేయాలన్నారు.ఉత్సవాలలో మార్గసూచికలను, సమాచార బోర్డులను అన్ని చోట్ల కూడా అవసరం మేరకు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైనచోట్ల ఆంగ్ల, కన్నడ, హిందీ భాషలలో కూడా సూచికబోర్డులు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్, శ్రీశైలప్రభ విభాగాన్ని ఆదేశించారు.ఉత్సవాలలో తగినంత మేరకు అడ్డుప్రసాదాలను సిద్ధం చేసుకోవాలని ఆలయవిభాగాన్ని ఆదేశించారు.

ఉత్సవ సమయాలలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే పారిశుద్ధ్యం, పోలీస్, వైద్య ఆరోగ్యం, మొదలైన సిబ్బంది అందరికి విధినిర్వహణ సమయంలో వారు విధులు నిర్వహిస్తున్న ప్రదేశానికే అల్పాహారం, భోజనాలను పంపే ఏర్పాట్లు చేయాలని అన్నప్రసాద వితరణ విభాగాన్ని ఆదేశించారు. దీనివలన విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సమయం వృథాకాకుండా ఉంటుందన్నారు. అన్ని విభాగాల వారు కూడా ఇప్పటికే సిద్ధం చేసుకున్న ప్రణాళిక అనుసరించి ఉత్సవాలలో ఆయా ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement