Friday, May 3, 2024

MBNR: భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు

మక్తల్, మార్చి8 (ప్రభ న్యూస్) : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో అతి పురాతనమైన శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఇవాళ తెల్లవారుజాము నుండి శ్రీ మల్లికార్జున స్వామి వారికి అభిషేకాలు కొనసాగుతున్నాయి. పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. పెద్ద ఎత్తున అభిషేకాలు చేయిస్తున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో దర్శనం కోసం గంట నుండి రెండు గంటల సమయం పడుతుంది.

శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంతో పాటు మక్తల్ పట్టణంలోని అతి పురాతనమైన ఉమామహేశ్వరాలయం , శ్రీ కుంభేశ్వరాలయం, శ్రీ నగరేశ్వరాలయం ,శ్రీ ఆత్మలింగేశ్వరాలయం అదేవిధంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలోని శివాలయంలోనూ అభిషేకాలు, విశేష పూజలు కొనసాగాయి. భక్తులు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉపవాస దీక్షలు చేపట్టారు. స్వామివారికి అభిషేకాలు చేయించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయాల వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎండల నుండి తట్టుకోవడానికి టెంట్లు, కూర్చునేందుకు కుర్చీలతో పాటు మంచినీటి వసతిని కల్పించారు. భక్తులు ఆ పరమశివుడిని ప్రశాంతంగా దర్శించుకున్నారు. అర్చకులు తిప్పయ్య స్వామి, సిద్ధ రామయ్య స్వామి ఆధ్వర్యంలో విశేష పూజలు కొనసాగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement