Friday, May 17, 2024

TS: బీఆర్ఎస్ కొత్త మేనిఫెస్టో వస్తే.. ప్రతిపక్షాల మైండ్ బ్లాకే.. మంత్రి హరీష్ రావు

మక్తల్ : బీఆర్ఎస్ కొత్త మేనిఫెస్టో అక్టోబర్ 16న వరంగల్లో జరిగే సభలో కొత్త మేనిఫెస్టోను కేసీఆర్ ప్రకటిస్తారని, కొత్త మేనిఫెస్టో వస్తే ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవుతుందని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. చెప్పిందే చేయడం.. చేసేదే చెప్పడం కేసీఆర్ కు అలవాటని, అక్టోబర్ 16న ఏం చెప్పబోతున్నారో అనేది వేచి చూడాలన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో రూ.34 కోట్ల వ్యయంతో నిర్మించనున్న150పడకల ఆసుపత్రి భవనంతో పాటు ఫైర్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం, రుద్రసముద్రం వద్ద గోడౌన్, గుడిగండ్ల ,కర్ని గ్రామాల్లో 11 కెవి సబ్స్టేషన్, కృష్ణాలో ఆసుపత్రి భవన నిర్మాణం, కేజీబీవీ పాఠశాల నిర్మాణాలకు మంత్రి హరీష్ రావు మక్తల్ లోనే శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మక్తల్ ప్రగతి సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… వెయ్యి రూపాయల పెన్షన్ 2000, 2000 నుండి 3000, కళ్యాణ లక్ష్మీ పథకం రూ.50వేల నుండి లక్ష రూపాయలకు పెంచినట్టే, రాబోయే రోజుల్లో కొత్త పథకాలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు.

ఆరు గ్యారెంటీలు అంటున్న కాంగ్రెస్ పార్టీ పక్కనే ఉన్న కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేయలేక బోర్లా పడిందన్నారు. అక్కడ అమలు చేయలేని కాంగ్రెస్ తెలంగాణలో చేస్తామంటే నమ్మడానికి తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు కాదని గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏనాడు చేసిన దాఖలాలు లేవన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది చేస్తుందని చేసేదే చెబుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో కేసీఆర్ ను పోగడడం తెలంగాణలో వచ్చి తిట్టడం ఆయనకు అలవాటు అయిపోయిందన్నారు. 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనన్నారు. భాజపా అధికారంలోకి వస్తే మోటార్ కు మీటర్, ఇంటికి బిల్లు తప్పదని హెచ్చరించారు. మీటర్లు కావాలా.. బిల్లు కావాలా.. కాలిన ట్రాన్స్ఫార్మర్లతో కరెంటు కోసం, ఎరువుల కోసం రోడ్లు ఎక్కే పరిస్థితి కావాలా, 24 గంటల ఉచిత కరెంటు కావాలో రైతులే ఆలోచించుకోవాలన్నారు.

24 గంటల ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వంను మరోసారి ఆశీర్వదించాలని మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి వారం రోజులు నియోజకవర్గంలోనే ఉంటూ నిత్యం అభివృద్ధి కోసం పరితపిస్తుంటారన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న రోజు కూడా నియోజకవర్గంలో ఏదో గ్రామంలో పని ఉంది వెళతా అంటూ అనుమతి తీసుకొని బయలుదేరుతారన్నారు. అలాంటి ఎమ్మెల్యే మీ దగ్గర ఉండటం వ‌ల్లే 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు రెండు పంటలకు సాగునీరు అందిస్తున్నారని, ఇంతకంటే మంచి వ్యక్తి ఇంకెవరు దొరకరన్నారు. ఈసారి భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి హరీష్ రావు స్థానిలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు మన్నె శ్రీనివాస్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే ఎస్సార్ రాజేందర్రెడ్డి, డిసిసిబి చైర్మన్ చిట్యాల నిజాం పాషా, జెడ్పి చైర్ పర్సన్ వనజ ఆంజనేయులు గౌడ్, ఎస్సీ కర్పోరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రజని సాయిచంద్, రైతుబంధు సమితి అధ్యక్షురాలు చిట్టెం సుచరిత రెడ్డితో పాటు వివిధ మండలాల ఎంపీపీలు, జడ్పిటిసిలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement