Thursday, May 2, 2024

TS: ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది… మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్, అక్టోబర్ 4 (ప్రభ న్యూస్) : తెలంగాణలో ఉన్నది ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఉద్యోగులంటే సీఎం కేసీఆర్ కు అమితమైన ప్రేమాభిమానాలు ఉన్నాయని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణలో అభివృద్ధి సంక్షేమం విజయవంతంగా ముందుకు సాగుతున్నాయంటే అందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనదని మంత్రి పేర్కొన్నారు. బుధవారం టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్ ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకులు మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ ను మహబూబ్ నగర్ లో కలిసి ఐఆర్ పై పునరాలోచన చేయాలని, పెండింగ్ డీఏలు త్వరగా ఇచ్చేలా చూడాలని, ఈ హెచ్ ఎస్ పథకాన్ని అమలు చేయాలని ఈ అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి వారితో మాట్లాడుతూ… దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని స్థాయిలో తెలంగాణలో జీతభత్యాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని తెలిపారు. ప్రస్తుతం ఇచ్చిన ఐఆర్ ను సవరించి మరింత మంచిగా చేద్దామన్నారు. రాబోయే పీఆర్సీలోనూ అత్యధిక వేతనాలు వస్తాయని భరోసానిచ్చారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి రెండు పీఆర్సీలు ఊహించిన దానికంటే ముఖ్యమంత్రి అధికంగానే ఇచ్చారన్నారు. వచ్చే ఏడాది కూడా ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తు చేశారు. పెండింగ్ డీఏలు త్వరగా ఇచ్చేలా చూస్తామని, ఈ హెచ్ ఎస్ పథకాన్ని అమలుతో పాటు మెరుగైన పీఆర్సీ వచ్చేలా చేస్తామని, ఉద్యోగుల సమస్యలన్నింటినీ తీరుస్తామని మంత్రి తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచింది, పీఆర్సీ ఇచ్చింది దేశంలో ఒక తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని మంత్రి వెల్లడించారు. ఐఆర్ తక్కువగా వచ్చిందని అపోహ వద్దని, కచ్చితంగా వారికి మెరుగైన ఐఆర్ వచ్చేలా చూస్తామన్నారు.

పేద ప్రజల సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నందున ఉద్యోగులు సహకరించాలని మంత్రి కోరారు. కరోనా తర్వాత ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదురైనా కేంద్రం ఒక్క రూపాయి సాయం చేయకపోయినా ప్రభుత్వం నిలదొక్కుకొని ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఖజానాపై భారం పడుతున్నా రైతుబంధు, దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు, రెండు పడకల ఇండ్ల నిర్మాణం, గృహలక్ష్మి వంటి సంక్షేమ కార్యక్రమాలు నిరాటంకంగా తమ ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. ప్రభుత్వం అత్యధిక వేతనాలు చెల్లిస్తున్నా అందులో అధిక మొత్తం ఇన్కమ్ టాక్స్ చెల్లించేందుకే వెళుతోందని, రెండు నెలల జీతం ఐటి కోసం వెళ్లడం సరికాదని, దీనిపై కేంద్రం పైన ఒత్తిడి తీసుకొస్తామని మంత్రి తెలిపారు.

- Advertisement -

ఐటీ పరిధి పెంచి ఉద్యోగుల నుంచి టాక్స్ పేరిట కోతలు తగ్గించేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీ వల్లే సీపీఎస్ వచ్చిందని, ఒకరు బిల్ ప్రవేశపెడితే మరొకరు ప్రతిపాదించారన్నారు. పాత పింఛన్ విధానం తిరిగి తీసుకువచ్చేందుకు కేసీఆర్ కృషి చేస్తారని, తిరిగి ఏర్పడే కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ కీలక పాత్ర పోషించి పాత పింఛన్ విధానం అమలయ్యేలా చూస్తారన్నారు. తెలంగాణ ఉద్యోగుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లప్పటికీ కట్టుబడి ఉన్నారని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ అసోసియేట్ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేశాయ్ నంద కిషోర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement