Sunday, May 5, 2024

దళిత చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి.. మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి/పెద్దమందడి: మే 2 (ప్రభ న్యూస్); దళిత చట్టాలను పకడ్బందీగా అమలు చేసి, వారి అభివృద్ధికి పాటుపడాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఐడిఓసిలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నాగర్ కర్నూల్ ఎంపీ రాములు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ రక్షిత కె.మూర్తితో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… దళితుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేసిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దళిత చట్టాలను కఠినంగా అమలు చేసి వారికి సంక్రమించాల్సిన ప్రతి హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డివిఎంసి సభ్యులు, అధికారులు దళితవాడలను సందర్శించాలన్నారు. ఎంపీ రాములు మాట్లాడుతూ… ప్రతి జిల్లాకు ఒక పిపి ఉండేలా ప్రభుత్వానికి లేఖ రాయాలని కోరారు. కుల వివక్ష లేకుండా ప్రతి గ్రామంలో అందరూ కలిసిమెలిసి జీవించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే జిల్లాలో దళితుల అభివృద్ధి తదితర అంశాలపై మాట్లాడారు. గ్రామాల్లో కమిటీ సభ్యులు, అధికారులందరూ పర్యటించి కుల వివక్ష నిర్మూలించే చర్యలు తీసుకోవాలన్నారు. దళితులకు రావాల్సిన నష్టపరిహారం వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ.. జిల్లాలో దళిత అభివృద్ధి పథకాలు కచ్చితంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతినెలా పౌరహక్కుల దినోత్సవం నిర్వహించి గ్రామాల్లో అంటరానితనం నిర్మూలన, తదితర అంశాలపై ప్రజలతో అవగాహన కల్పించేందుకు సమావేశాలు నిర్వహించి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎస్పీ రక్షితకే మూర్తి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సమానమనే భావనతో ప్రజలు జీవించాలన్నారు. దళిత చట్టాలను కచ్చితంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ డిఎస్పి ఆనంద రెడ్డి, ఆర్. డి. ఓ. పద్మావతి, కమిటీ సభ్యులు, గంధం నాగరాజు, కోళ్ల వెంకటేష్, మీషేక్, మధుకర్, నారాయణ నాయక్, విజయ్ లక్ష్మి, శ్రీనివాస్ రెడ్డి, అధికారి నుషిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement