Saturday, May 4, 2024

MBNR: చట్ట వ్యతిరేక కార్యాలాపాలకు పాల్పడితే ఉక్కుపాదం.. ఎమ్మెల్యే యెన్నం

మహబూబ్ నగర్, డిసెంబర్ 6 (ప్రభ న్యూస్) : మహబూబ్ నగర్ నియోజకవర్గంలో గతంలోని చీకటి రోజులు పోయాయని, ఇక వెలుగు రేఖలు విచ్చుకున్నాయని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలు ఇక స్వేచ్ఛాయుత వాతావరణంలో హాయిగా జీవించ వచ్చని, నియోజకవర్గంలో ఇక నుంచి ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టం ఉక్కుపాదంతో అనిచి వేస్తదని హెచ్చరించారు. తాను ఎమ్మెల్యేగా అధికారం చెలాయించడానికి రాలేదని, మీ సేవకుడిగా ఉంటూ నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలను సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అన్నివర్గాల వారికి అందించడానికి వచ్చానని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధిలో అన్నివర్గాల వారు తమ ఆలోచనలను పంచుకోవాటానికి దైర్యంగా ముందుకు రావాలని, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎమ్మెల్యేది కాదు అది పాలమూరు ప్రజల క్యాంపు కార్యాలయమని పేర్కొన్నారు.

ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన అమలు పరుస్తామని, మైనారిటీ సోదరుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. మహబూబ్ నగర్ పట్టణంలో మతాలకు అతీతంగా గంగా జమున తహిజిబ్ అనే వాతావరణానికి ఆటంకం కలగకుండా చూస్తామన్నారు. కాగా మహబూబ్ నగర్ ముద్దు బిడ్డ, పోరాట యోధుడు రేవంత్ రెడ్డికి సీఎంగా అవకాశం ఇచ్చినందుకు సోనియా గాంధీకి, ఖర్గే, రాహుల్ గాంధీలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని బస్టాండ్ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు వినోద్ కుమార్, సిరాజ్ కాద్రి, లక్ష్మణ్ యాదవ్, బెనహర్, చంద్రకుమార్ గౌడ్, సాయిబాబా, జిల్లా మాజీ మహిళా అధ్యక్షురాలు అనిత, వివిధ విభాగాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement